విజయశాంతి.. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక. అందుకనే విజయశాంతిని లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అని పిలిచేవారు. ఇలా చెప్పుకుంటూ పొతే విజయశాంతికి ఉన్న బిరుదులు చాలానే ఉన్నాయి. 1980లో వచ్చిన “కిలాడీ కృష్ణుడు” మూవీతో తెలుగు తెరకు పరిచయమైన విజయశాంతి, కెరీర్ ప్రారంభంలో హీరో చెల్లి పాత్రలు కూడా చేశారు.
హీరోయిన్‌గా నిలదొక్కుకున్నాక ఆమె వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె తెలుగు వెండితెరపై మకుటం లేని మహారాణిగా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోల సినిమాలలో కూడా ఆమెకు కొన్ని యాక్షన్ సన్నివేశాలతో హీరోకి సమానంగా పాత్రను ఇచ్చేవారు.
ఈ సందర్భంగా విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ... కిలాడి కృష్ణుడు నా మొదటి సినిమా ఆ సినిమాకి ముందు సుమారు తొమ్మిది సినిమాలు నేను తమిళ్‌లో చేసినా కృష్ణ గారి కాంబినేషన్‌గా నా నటనా ప్రస్థానంలో ప్రాముఖ్యత ఇప్పటికి కలిగి ఉంటూనే ఉంది ఆ చిత్రం. 180కి పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల తర్వాత కూడా ఇప్పటికీ అదే గౌరవం అంకితభావం సినిమా పట్ల కళాకారిణిగా నా విధానం.
కొంత ఎక్కువ విరామం తరువాత మహేష్ బాబు గారి సినిమా కాంబినేషన్‌లో తిరిగి మరొకసారి ఆర్టిస్ట్‌గా నా ప్రజల ముందుకు రానున్న సంవత్సరం 2020 అన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... విజయశాంతి మొదటి చిత్రం కిలాడి కృష్ణుడు, కృష్ణ గారితోనే... రీ-ఎంట్రీ మహేష్ బాబుతో. అందుకనే రీ-ఎంట్రీకి ఈ సినిమానే కరెక్ట్ అని భావించి ఓకే చెప్పానని మనసులో మాట చెప్పకనే చెప్పారు.