ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: నట్టి కుమార్

గురువారం, 1 జూన్ 2023 (18:08 IST)
nattikumar ph
ఏపీ ఫైబర్ నెట్ లో  కొత్త సినిమాలు పదర్శించబోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ స్పష్టం చేశారు. థియేటర్స్ లో కొత్త సినిమా విడుదలైన మొదటి రోజునే ఏపీ ప్రభుత్వం ఆద్వర్యంలోని ఫైబర్ నెట్ లో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన  ప్రారంభోత్సవం శుక్రవారం విశాఖపట్నంలో జరగనుంది. 
 
ఈ నేపథ్యంలో దీనిపై నట్టి కుమార్ స్పందిస్తూ, ``దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్ లో  కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించబోతున్నామని ప్రభుత్వం అంటోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక నిర్మాతగా ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను వ్యతిరేకిస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమను, అలాగే నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్ ను సంప్రదించకుండా, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు. 
 
గతంలో అంటే 2013వ సంవత్సరంలోనే ఎయిర్ టెల్ డీటీహెచ్ ద్వారా సినిమా విడుదల రోజునే సినిమాలను ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ అది సక్సెస్ కాలేదు. తమ సినిమాలు ఇచ్చే నిర్మాతలు ముందుకు రానప్పుడు ఇది ఎలా సక్సెస్ అవుతుంది. వాస్తవానికి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను సర్వనాశనం చేసేవిధంగా ఈ విధానం ఉంటుంది. అందుకే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్  మాత్రమే కాకుండా అత్యధికభాగం నిర్మాతలు దీనికి వ్యతిరేకం. అయినప్పటికీ, ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి గారు సినీరంగానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా సినీ పరిశ్రమ వారితో మీటింగ్ ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకోకుండా దీనిని ఆచరణలోకి తీసుకుని రావడం ఎంతమాత్రం సహేతుకం కాదు. ఇప్పటికే ఎగ్జిబిషన్ వ్యవస్థ దెబ్బతినిపోయింది. 
 
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫైబర్ నెట్ లో సినిమాల నిర్ణయం వల్ల ఎగ్జిబిషన్ వ్యవస్థ మరింతగా కోలుకోలేనివిధంగా తయారవుతుంది. శుక్రవారం వైజాగ్ లో ప్రారంభం కాబోయే ఫైబర్ నెట్ సినిమాల ఆవిష్కరణ సభకు సంబంధించి నిర్మాతలను కానీ, సినీ పరిశ్రమకు చెందిన ఇతరులకు తెలియకుండా, పిలుపు లేకుండానే జరపబోతున్నారు ఏపీ మంత్రులు గోపాలకృష్ణ, గుడివాడ అమర్నాథ్, ఎఫ్.డి.సి చైర్మన్ పోసాని, ఇంకా సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలిసింది. పరిశ్రమ వారిని కలుపుకుని పోకుండా, వారికి ఆహ్వానం లేకుండా వారికి వారే ఈ ప్రారంభాన్ని జరపబోవడం విడ్డురంగా ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై పునరాలోచించి ఎవరికీ ఇబ్బందిలేని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను'' అని అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు