ప్రముఖ రచయిత్రి కమలాదాస్ అస్తమయం

పురుషాధిక్య సమాజం, ఛాందసవాద భావాలపై రాజీలేని పోరాటం చేసిన ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి కమలాదాస్ సురయ్యా (75) కన్నుమూశారు. కేరళలో జన్మించిన సురయ్యా మహారాష్ట్రలోని పుణెలోని తుదిశ్వాస విడిచారు. శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ... ఏఫ్రిల్ 18న ఆసుపత్రిలో చేరిన ఈమెకు ఆదివారం తెల్లవారుజామున శాశ్వతనిద్రలోకి జారుకున్నారు.

కథలైనా, కవితలైనా, ఎలాంటి రచనలనైనా అతి సులువుగా, ఆసక్తికరంగా రాయగలిగే కమలాదాస్... కేరళలోని సంప్రదాయ "నాయర్" కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సాహితీ ప్రముఖులే కావడంతో, ఈమెకు పుట్టుకతోనే సాహితీ వారసత్వం మెండుగా అబ్బింది.

అలా... తల్లిదండ్రుల సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కమలాదాస్... సైద్ధాంతికంగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. బలవంతంగా రుద్దిన విధానాలు, అహేతుకమైన సంప్రదాయాలంటే ఆమెకు గిట్టేది కాదు. వీటినుండి బయటపడి ఆమె రచనలను, జీవితాన్ని కొనసాగించారు.

పురుషాధిక్య సమాజంలో దెబ్బతిన్న మహిళల మనోభావాలకు కమలాదాస్ తన రచనల్లో పెద్దపీట వేశారు. ఛాందసవాద భావాలపై కూడా ఈమె తన కలాన్నే కత్తిగా మార్చి... సమాజంలోని హిపోక్రసీని దునుమాడటమే ప్రధాన లక్ష్యంగా తన రచనలను కొనసాగించారు.

పదాలలో అంతులేని పొదుపు పాటిస్తూనే, పాత్రల చిత్రణలో ఏ మాత్రం రాజీపడని శైలి కమలాదాస్ సొంతం. పదేళ్లక్రితం ఇస్లాం స్వీకరించిన ఈమె సురయ్యాగా మారారు. ఇస్లాం పుచ్చుకోవడం, బురఖా ధరించడాన్ని ఛాందసవాదులు నిరసించినా ఈమె ఏ మాత్రం ఖాతరు చేయలేదు.

కమలాదాస్ కలం నుంచి జాలువారిన సమ్మర్ ఇన్ కలకత్తా, అల్ఫాబెట్స్ ఆఫ్ లస్ట్, డిసెండెంట్స్ లాంటి రచనలు ఎంతో పేరుపొందాయి. ఈమె తన ఆత్మ కథను "మై స్టోరీ" అనే పేరుతో ప్రచురించగా... ఇది ఆమె రచనలన్నింట్లోకీ అత్యంత సంచలనం సృష్టించింది. కాగా... కమలాదాస్ రచనలకు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.

వెబ్దునియా పై చదవండి