తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండుగను సెయింట్ లూయిలో వైభవంగా జరుపుకున్నారు. అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణా వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెయింట్ లూయిలోని క్యాజిల్వుడ్ స్టేట్ పార్కులో జరిగిన ఈ వేడుకలకు 350కి పైగా తెలంగాణ ప్రవాస ప్రముఖులు హాజరైనట్లు ఫోరమ్ వెల్లడించింది.
ఇకపోతే.... బతుకమ్మ సంబరాల్లో భాగంగా చిన్నారులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తలపై మోస్తూ తీసుకొచ్చారు. అనంతరం అందంగా కొలువు తీర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు పాటలు పాడుతూ తిరిగిన వైనం చూపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.
మరోవైపు తెలంగాణ వంటకాలతో వడ్డించిన భోజనం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కొలువు దీరిన బతుకమ్మలను సంప్రదాయ బద్ధంగా సరస్సులో నిమజ్జనం చేశారు.