ఒక గ్రామమే ఆ సినిమాలో నటించింది.. బైలంపుడి రివ్యూ రిపోర్ట్

శనివారం, 27 జులై 2019 (17:08 IST)
సినిమా పేరు : బైలంపుడి
నటీనటులు : హరీష్‌ వినయ్‌, బ్రహ్మానంద రెడ్డి, తనిష్క్‌ రాజన్‌
సాంకేతికత: ఛాయాగ్రహణం, 
దర్శకత్వం : అనిల్‌ పిజి రాజ్‌, 
సంగీతం : సుభాష్‌ ఆనంద్‌, 
నిర్మాత: బ్రహ్మానంద రెడ్డి.
విడుదల: 27 జూలై 2019.
 
కొత్త తరం కొత్త కథలతో టాలీవుడ్‌లో ప్రవేశిస్తున్నారు. వాస్తవిక కథాంశాలను తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన వారినే నటీనటులుగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం 'బైలంపుడి'. సికాకులం ప్రాంతానికి చెందిన ప్రాంతమైన అక్కడి గ్రామీణ వాతావరణాన్ని, పెత్తందారి తనాన్ని చూపించిన ఈ చిత్రంలో హరీష్‌ వినయ్‌, తనిష్క్‌ రాజన్‌ జంట నటించారు. శనివారమే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం. 
 
కథ :
బైలం పూడి గ్రామంలో గ్రామపెద్ద గురు నారాయణ్‌ (బ్రహ్మానందరెడ్డి). అతడంటే ఊరిజనానికి భయంతో కూడిన గౌరవం. కానీ అదే ఊరిలో ఆటో నడిపి అమ్మకు తోడుగా వుండే రవి (హరీష్‌ వినయ్‌)కు అంతనంటే గౌరవం లేదు. ఓ సందర్భంలో ఎదిరిస్తాడు. అతని ధైర్యానికి ముచ్చటపడి గురు నారాయణ్‌ దగ్గర పెరుగుతున్న కళ్యాణి (తనిష్క్‌ రాజన్‌) రవిని ఇష్టపడుతుంది. 
 
రవి సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. మరోవైపు రవి స్నేహితుల్లో ఒకరిని దుండగులు హత్య చేస్తారు. అది గురు నారాయణ్‌ పనే అని అతనిపై ఎటాక్‌చేసి చంపేస్తాడు. కొన ఊపిరితోవున్న అతను హత్య ఎవరు చేశారనేది వివరిస్తాడు. అది విన్న రవి షాక్‌కు గురయి తన స్నేహితుడ్ని చంపిన వ్యక్తిపై ప్రతీకారానికి బయలుదేరతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు రవి స్నేహితుడ్ని చంపిందెవరు? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఇందులో నటించినవారంతా దాదాపు కొత్తవారే. ఆ గ్రామానికి చెందినవారే కావడం విశేషం. వారిని దర్శకుడు సరైన తీర్ఫదు ఇచ్చి వారినుంచి నటన రాబట్టుకోగలిగాడు. ముఖ్యంగా నిర్మాత బ్రహ్మానందరెడ్డి (గురునారాయణ) పాత్రలో మెప్పించాడు. బాడీలాంగ్వేజ్‌ కరెక్ట్‌గా సరిపోయింది. రవి పాత్ర పక్కా గ్రామంలోని కుర్రాడిలా వుంది. హీరోగా నటించిన హరీష్‌ వినయ్‌ బాగా నటించాడు. 
 
డ్యాన్స్‌‌లతో పాటుగా ఫైట్స్‌‌లలో కూడా రాణించాడు. తనిష్క్‌ రాజన్‌ ఆల్రెడీ పలు చిత్రాల్లో నటించింది. ఇందులో ప్రతీకారం కోసం రగిలిపోయే పాత్రలో కన్పిస్తుంది. రౌద్రాన్ని కూడా పండించింది. ఆమె అన్నగా గుణ పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా ఇందులో కీలకమైన పాత్ర పోషించాడు. ఇక హీరో ఫ్రెండ్స్‌గా నటరాజ్‌, నత్తి నరి హాస్యంతో మెప్పించారు. వారి నుంచి వచ్చిన ఎమోషన్స్‌ పర్వాలేదనిపించాయి.
 
దర్శకుడే కెమెరామెన్‌ కావడంతో తనకు ఎలా కావాలో వాటిని రాబట్టుకున్నాడు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో లొకేషన్స్‌ అన్నీ చాలా రియాలిటీగా దగ్గరగా కళ్ళకు కట్టినట్టు అనిపించాయి. పాటలు తక్కువే అయినా పర్వాలేదనిపిస్తాయి. సంగీతం బాగా కుదిరింది. నేపథ్య సంగీతం కూడా ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యింది. 
 
కథలో ప్రధానమైన అంశం గంజాయి సమస్య. గ్రామాల్లో ఎక్కువగా కన్పించే అంశమే ఇది. దాన్ని చక్కగా తెరకెక్కించే ప్రయత్నం జరిగింది. దాని చుట్టూ ఓ కథని అల్లుకొని మంచి ప్రయత్నమే చేసాడు అనిల్‌. 
 
సన్నివేశపరంగా డైలాగ్స్‌ కుదిరాయి. పరిమిత బట్జెట్‌తో తీసిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుడు మెచ్చే చిత్రమవుతుంది. అంతా కొత్తవారు కావడంతో చిన్నపాటి లోపాలున్నా వాటిని మర్చిపోయేలా చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతి ఒక్క చూడతగ్గ చిత్రమిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు