నటీనటులు: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్: ఫహద్ అబ్దుల్ మజీద్, మ్యూజిక్ డైరెక్టర్: NYX లోపెజ్, రచయిత, ఎడిటర్, దర్శకుడు: రిషికేశ్వర్ యోగి నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల ప్రాజెక్ట్ హెడ్: సుధీర్ కుమార్, విడుదల. 2510 2024
కథ:
సత్య (శివకుమార్ రామచంద్రవరపు)కు నటనంటే ఇష్టం. ఓ ఛాన్స్ కోసం ఆడిషన్ కు వెళ్ళి ఫెయిల్ అవుతాడు. ఇది సెట్ కాదని సత్య తండ్రి, దయానంద్, సత్య స్నేహితుడు వైవా రాఘవ కూడా ఏదైనా ఉద్యోగం చేసుకోమంటారు. దాంతో హర్ట్ అయిన సత్య ఎవరికి చెప్పకుండా కేరళకు వెళతాడు. అక్కడ వెళ్ళగానే సమస్యలో ఇరుక్కున్న సత్యకు సల్మాన్ (నితిన్ ప్రసన్న) పరిచయం అవుతాడు. సల్మాన్ పరిచయంతో సత్యలో మార్పు వస్తుంది. అది ఏమిటి? అసలు నటుడిగా సత్య రాణించలేకపోవడానికి కారణం ఏమిటి? కేరళకు సత్య ఎందుకు వెళ్లాడు? సత్య, సల్మాన్ జర్నీ ఎలా కొనసాగింది? తదంతర పరిస్థితులు ఏమిటి? అనేవి మిగిలిన సినిమా.
సమీక్ష:
నటనమీద రాసుకున్న పాయింట్ అలాఅలా మలుపులు తిరుగుతూ కేరళ వెళ్ళాక కథ రక్తికడుతుంది. కథను సింగిల్ లైన్‌గా చూస్తే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మొదటి పార్ట్ లో చిన్న అమ్మాయి సన్నివేశాలు, ప్రెగ్నెంట్ ఉమెన్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. కథను చూపు క్రమంలో కొంత స్క్రీన్ ప్లే లో తడబాటు కనిపిస్తుంది. పక్కా మాస్ ను ఆకట్టుకునే సన్నివేశాలు ఇందులో వున్నాయి. సల్మాన్ లవర్ పెళ్లి, మందుపార్టీ, వేశ్య ఇంటికి వెళ్లిన క్రమంలో సీన్స్ మెప్పించేలా వున్నాయి.
కొత్తగా అనిపించిన నటీనటులు బాగా కథకు అమరారు. దర్శకుడు ఎటువంటి కమర్షియల్ హంగులకు వెళ్లకుండా నిజాయితీగా ఎమోషనల్ టచ్‌తో సినిమాను ముగించడం ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఇంతకుముందు విలన్ పాత్రలతో మెప్పించిన శివకుమార్ తనను తాను నిరిరూపించేందుకు చేసిన సినిమా ఇది. మంచి ప్రయత్నం. నితిన్ ప్రసన్న వినోదంతోపాటు భావోద్వేగాన్ని పండించాడు. శృతి జయన్ పాత్రకు న్యాయం చేసింది. ఇతర నటీనటులు దయానంద్ రెడ్డి, వైవా రాఘవ తదితరులు మెప్పించారు.
సాంకేతికపరంగా చూస్తే, కథకుడిగా, దర్శకుడుగా రిషికేశ్వర్ యోగి పూర్తి నిజాయితీగా పనిచేశాడు. అనంతరం సినిమాటోగ్రఫీ అబ్దుల్ మజీద్ కేరళ అందాలను కెమెరాలో బంధించారు. పెయింటింగ్‌లా పచ్చదనంతో నింపేశాడనే చెప్పాలి. లోపెజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని చాలా సన్నివేశాలకు సహజత్వాన్ని తెచ్చిపెట్టింది. ఇటువంటి సినిమాను పెద్ద నిర్మాణసంస్థలు పార్టనర్ కావడం విశేషమనే చెప్పాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సీ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్, ఎస్ స్వ్కేర్ సినిమాస్ బ్యానర్స్ కలిసి నిర్మించాయి.
మొత్తంగా చూస్తే ఫస్టాఫ్‌లో కొన్ని ఎమోషన్స్, సెకండాఫ్‌లో ఫన్ ఈ సినిమాకు వన్నె తెచ్చాయి. కథ స్లోగా సాగడం, కొన్ని సన్నివేశాలపై మరింత కసరత్తు చేయకపోవడం వంటి చిన్నపాటి లోపాలున్నా చక్కటి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. మూలాలలోకి వెళ్ళి తీసిన ఈ సినిమా అందరినీ మెప్పించేలా వుంది.