సాంకేతికత: మాటలు: సాయిమాధవ్ బుర్రా- ప్రణవ్ చంద్ర నిర్మాత: దయాకర్ రెడ్డి కథ- స్క్రీన్ ప్లే: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి- జ్యోతికృష్ణ., సంగీతం: కీరవాణి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నేడు విడుదలైంది. కథానాయకుడిగా వున్నప్పుడు సినిమా మొదలు పెట్టి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాక వస్తున్న సినిమా కావడంతో క్రేజ్ సంతరించుకుంది. ఇద్దరు దర్శకులు కావడంతో ఎలా తీసివుంటారనే ఆసక్తికూడా అందరిలోనెలకొంది. 16వ శతాబ్దంనాటి ఔరంగజేబ్ పాలనలో ప్రజలు ఎలావున్నారనేది కథాంశమని ముందుగానే తెలిపారు. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
ఇక కథ ప్రకారం:
ముందుగా ఈ కథ కల్పితం అని స్లయిడ్ లోనే చెప్పాశారు. 16వ శతాబ్దంలో భారత దేశంలో ఢిల్లీ లో మొఘలు ఇస్లాం మత స్థాపనే ఆధిపత్యం సాగుతున్న కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో దొరలు, నవాబ్ లు హిందూవులను బానిసలుగా చూస్తుండేవారు. హిందూవుగా వుంటే జిజియా పేరుతో పన్ను విధించడమే కాకుండా దేవుడి విగ్రహాలను పూజిస్తే కొరడాలతో శిక్షించేవారు. అలాంటి తరుణంలో సామాన్యుడిగా దొంగగా అవతారం ఎత్తి వచ్చిన వ్యక్తే వీర. ఉరఫ్ హరిహరవీరమల్లు.
తెలుగు ప్రాంతాలను దొరలు పాలించేవారు. వారు ఇక్కడ సంపదను దోచి గొల్కొండ నవాబ్‌కు కొంత ఇచ్చేవారు. అందులో వజ్రాలు ఎక్కువగా వుండే ప్రాంతాలను బానిసలచేత పనిచేయించేవారు. వారికి విముక్తి కలిగించేందుకు వీరమల్లు వచ్చి విడిపించే క్రమంలో దొరతో చేసుకున్న ఒప్పందంతో వజ్రాలు గొల్కొండ నవాబ్ కుతుబ్ షాహీకి అందజేసేతరుణంలో దొంగతనం చేయమని వీరమల్లుతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామలతో దొర దగ్గరున్న నిధిఅగర్వాల్, వీరమల్లును మోసంచేసి వజ్రాలు పట్టుకుపోతుంది. ఆ తర్వాత గొల్కండ నవాబ్ వీరమల్లు సాహసాలు తెలుసుకుని ఆయన్ను శిక్షించకుండా వీరమల్లు చేత ఢిల్లీలో వున్న కోహినూర్ వజ్రం తీసుకురమ్మని పురమాయిస్తాడు. ఇక దానికోసం వీరమల్లు చేసే ప్రయాణమే మిగిలిన సినిమా.
సమీక్ష:
ఇది దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రాసుకున్న కథ. ఏలూరు సమీపంలోని కొల్లూరులో కోహినూర్ వజ్రాన్ని ఢిల్లీ పాలకులు దోచుకుని ఔరంగజేబు కాలానికి ఆయనకు దక్కుతుంది. దాన్ని భద్రంగా తన కోటలో భద్రపరుస్తాడు. దానితోపాటు హిందూ ధర్మాన్ని రక్షించే పూజారులను వేదాలు బోధించే గురువులను ఢిల్లీలో కోటలో అడుగన బంధించేవాడు. వీరమల్లు వచ్చేవరకు వారిని బంధించి వచ్చాక అందరినీ చంపేయాలనేది ప్లాన్ ఔరంగజేబ్ ది.
ఈమధ్యలో తన పాలనలో సామంతులు, దొరలు ఏవిధంగా ఔరంగజేబ్‌కు తొత్తులుగా వున్నారు. ఎదురుతిరిగిన కొంతమంది రాజులను ఏవిధంగా చంపాడు. అనేది కథనంలో చూపించారు. ఈ క్రమంలో రకరకాల పాత్రలు వస్తుంటాయి. వీరమల్లు తను నమ్మిన సునీల్, సుబ్బరాజు, నాజర్, రఘుబాబు వంటి వారిని వెంటబెట్టుకుని దోపిడీలు చేస్తుంటాడు. అవి ఎలా చేశాడు? అనేవి సినిమాటిక్ గా చూపించారు.
చరిత్రతో ముడిపెట్టి ఒక కల్పిత కథను చెబుతున్నపుడు గొప్ప నైపుణ్యం చూపిస్తే తప్ప దాన్ని ప్రేక్షకులు అంగీకరించరు. అది అందరికీ సాధ్యంకాదు. క్రిష్ పూర్తిగా చిత్రానికి పనిచేస్తే మరోలా వుండేది. కానీ దర్శకత్వం తెలిసిన జ్యోతిక్రిష్ణ కూడా వున్నా, అసలు కథ రాసింది క్రిష్ కాబట్టి ఇంకాస్త డెప్త్ గా సన్నివేశాలు వుండేవనిపిస్తుంది. దానితోపాటు రెండు భాగాలుగా హరిహర వీరమల్లు సినిమా చెప్పడం కూడా సాహసమే అనుకోవాలి. ఇంటర్ వెల్ బ్లాక్ బాగుంది. సెకండాఫ్ లో ఢిల్లీ కి వెళ్లేబాటలో అడ్డంకులు, ప్రజల సమస్యలు అన్నీ చూపించడంతో సరిపోయింది. క్లయిమాక్స్ లో పెనుతుఫాన్ (టొరంటోలు) రావడంతో వీరమల్లును, ఔరంగజేబ్ ను కలవడంతో ముగుస్తుంది. దానితో అసలు వజ్రం దక్కించుకున్నాడా? లేదా? హిందూదర్మాన్ని రక్షించే వేదపండితులు ఏమయ్యారు అనేవి కూడా రెండో పార్ట్ లో చూడండి వదిలేశాడు.
సినిమాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోపాటు అభిమానులు మెచ్చే డైలాగ్స్, సన్నివేశాలు కూడా వున్నాయి. పాత్రకు తను బాగా సూటయ్యాడు. యాక్షన్ సీన్స్ లో సిజి వర్క్ కనిపిస్తుంది. కల్పితమైన కథే అయినా దర్శకుడికి దర్శకుడికి తేడా వుంటుంది. ఆ తేడా ఇందులో కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో దేశమంతటా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా సాగిన ఔరంగజేబుకు.. వీరమల్లు అనే హిందూ ధర్మ పరిరక్షకుడు ఎదురు నిలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ రాశాడు. అప్పట్లో ప్రజలకు నరరూప రాక్షసుల్లా వారు పీడించేవారు. ఇది అసలు కథలోవున్నాయి. కానీ పాలకులు వాటిని మరుగనపెట్టి ముస్లింనాయకులు గొప్పగా చూపించడం దారుణమైన విషయమని వీరమల్లు పాత్ర చేత క్రిష్ చెప్పిందలిచాడు.
ఇందులో సంబాషణలపరంగానూ, సన్నివేశాలపరంగానూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముద్ర కూడా వుందనేలా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్ లో శంబాజీ సినిమా వచ్చింది. అందులో వున్న ఆసక్తి ఇందులో లోపించినట్లుగా వుంటుంది. ముఖ్యంగా పులి, తోడేలు వంటి జంతువులను మచ్చిక చేసుకునే విద్య విషయాన్ని కొత్తగా చూపించాడు. మన హిందూ ధర్మంలో వేదాలుతోపాటు అన్ని విద్యల్లో ఆరితేరేవారు. దాన్ని హైలైట్ చేస్తూ చిన్న టచ్ ఇచ్చాడు వీరమల్లు పాత్రలో.
హైలైట్ అనిపించే కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇంటర్వెల్ బ్లాక్. వందల మంది సైన్యాన్ని బోల్తా కొట్టించి వీరమల్లు బృందం వజ్రాలను కొల్లగొట్టే ఈ ఎపిసోడ్ ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. ఓవరాల్ గా కొన్ని ఎపిసోడ్ల వరకు ఎంగేజ్ చేసినా... మొత్తంగా హరిహర వీరమల్లు ఫుల్స్ మీల్స్ లా అనిపించదు.
అప్పటి కాలంలో దొరలను చూస్తూ మాట్లాడకూడదు. చెప్పులు వేసుకోకూడదు. ఇటువంటి నిబంధనలు చక్కగా చూపించాడు. వర్షాభావం వుంటే వరుణయాగం చేసే పండితులును చూపించాడు. హిందూవులు పూజించే దేవతా విగ్రహాలను కరిగించడం వంటి విక్రత చేష్టలు చూపించాడు. ఫైనల్ ఈ సినిమాలో ధర్మం అంటే భజన కాదు. ఎదురొడ్డి నిలబడడం అని చిన్న పిల్లచేత అనిపించి రాజు తొత్తులను ఎదుర్కొనే సన్నివేశంలో రచయితలు రాశారు.
ఔరంగజేబుగా బాబీ డియోల్ సరిపోయాడు. వేద పండితుడిగా సత్యరాజ్, దొరగా సచిన్ ఖేద్కర్ తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. సునీల్.. నాజర్.. సుబ్బరాజు.. రఘుబాబు.. వీళ్లంతా సహాయ పాత్రల్లో ఓకే అనిపించారు. సాంకేతిక విభాగాల్లో హరిహర వీరమల్లుకు అతి పెద్ద బలం కీరవాణి నేపథ్య సంగీతమే. ఆయన స్కోర్ బాగుంది. కథలో కీలకమైన ఎపిసోడ్లను బీజీఎంతో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫీ బాగుంది. సినిమాకు వీఎఫెక్స్ మరింతగా చొప్పిస్తే రాజమౌళి తరహా సినిమా అయ్యేది.
విపరీతమైన ఆలస్యం వల్లో ఏమో ఈ సినిమా కూడా ఏదో మసకబారిన ఫీలింగ్ కలుగుతుంది. ఏది ఏమైనా మంచి సినిమా తీయాలన్న రత్నం ప్రయత్నం, దర్శకుడి ప్రతిభ, పవన్ కళ్యాణ్ హిందుయిజం ఇందులో కనిపించాయి.
పవన్ కళ్యాణ్ బాధ్యతగా చేసిన సినిమా ఇది. కొన్నిలోపాలున్నా వాటిని పక్కనపెడితే హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంగా సినిమా తీసినందుకు అందరినీ అభినందించాల్సిందే.