సరికొత్తగా 'కల్కి'... తెలుగు తెరపై మరో కొత్త ప్రయోగం

శుక్రవారం, 28 జూన్ 2019 (17:48 IST)
నటీనటులు: రాజశేఖర్‌, ఆదాశర్మ, శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్‌ విల్సన్‌, రాహుల్‌ రామకష్ణ, నాజర్‌, అశుతోష్‌ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు 
 
సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : దాశరథి శివేంద్ర, ఎడిటర్‌ :  గౌతమ్‌ నెరుసు, సంగీతం : శ్రవణ్‌ భరద్వాజ్‌, నిర్మాత : సి.కళ్యాణ్‌, దర్శకత్వం : ప్రశాంత్‌ వర్మ
 
రాజశేఖర్‌ హీరోగా 'గరుడవేగ' తరువాత వస్తున్న చిత్రం 'కల్కి'. ట్రైలర్‌లో రామాయణంలో పేర్కొన్న కొటేషన్లు నేపథ్య సంగీతంతో థ్రిల్‌ కల్గించేదిగా వుండడంతో సినిమాపై భారీ అంచనాలే వచ్చాయి. ఈ చిత్రానికి 'అ!' వంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రశంసలందుకున్న ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించడంతో మరో వినూత్నమైన అంశాన్ని తీసుకున్నట్లు తెలిసిపోయింది.
 
యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించారు. మరి ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలయింది. అదెలా వుందో చూద్దాం.
 
కథ:
అది కొల్లాపూర్‌ అనే గ్రామం. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం వరకు సాగిన కథతో వాయిస్‌ ఓవర్‌ సాగుతుంది. ఆ తర్వాత రెండు వర్గాలు కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు సాగిస్తూ ఉంటాయి. అందులో ఒక వర్గానికి చెందిన శేఖర్‌ బాబు హత్యకు గురికావడంతో హింస చెలరేగుతుంది. అసలు గొడవలకు కారణమేమిటి? దీనికి బాధ్యులెవరనేది శోధించడానికి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ కల్కి ఆ ఊరికి వస్తాడు. 
 
అప్పటికే ఆ పరిస్థితులను శోధించేందుకు నవభారత్‌కు చెందిన క్రైం రిపోర్టర్‌ రాహుల్‌ రవీంద్ర పనిలో నిమగ్నమవుతాడు. కల్కి రాగానే ఇద్దరూ కలిసి ఏవిధంగా ఆ గొడవలు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించారనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ: 
చిత్ర కథ రామాయణ మహాభారతకాలంనుంచి విన్నకథే అయినా దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఆ క్రమంలో స్క్రీన్‌ప్లేలో కొత్తదనాన్ని చూపాడు. ఒకరకంగా ఇది భారీ కథ. దానికితగినట్లే నిర్మాణ విలువలు బాగున్నాయి, అప్పటి కాలానికి తగినట్లుగా రాజభవనం, గ్రామ వాతావరణం, ప్రజల ఆహార్యం, వస్త్రధారణ అన్నీ భారీ తనానికి వన్నెతెచ్చాయి. 
 
అందుకు ఖర్చుకు వెనుకాడకుండా తీసిన ప్రతి సన్నివేశం చాలా రిచ్‌గా కనబడుతుంది. ఇటువంటి కథను యాంగ్రీ యంగ్‌మెన్‌గా వున్న రాజశేఖర్‌ తన పాత్రలో లీనమై నటించారు. రాజశేఖర్‌ని పోలీస్‌గా ప్రెసెంట్‌ చేయడంలో దర్శకుడు మార్కులు కొట్టేశాడు. ప్రతి సన్నివేశంలో సస్పెన్స్‌ను క్రియేట్‌ చేసిన విధానం చూపరలకు ఆశ్చర్యం కల్గించింది.

చివరివరకు ఆ ఉత్కంఠను కల్గించినా యాక్షన్‌ సన్నివేశాల్లో మరికొన్నిచోట్ల లాజిక్కులకు ఆస్కారంలేకుండా తీసేశాడు. కల్కి భగవానుడి పేరు. ఆ పేరు పెట్టుకున్న పోలీసు ఆఫీసర్‌ ఏవిధంగా దుష్టసంహారం చేశాడనేది ప్రధాన పాయింట్‌. దాన్ని చుట్టూ కొన్ని ఉప కథలు పెట్టి చిత్రానికి హైస్కేల్‌ తెచ్చాడు. అటు సంభాషణలపరంగా ఆకట్టుకున్నాడు. 
 
హనుమంతు సాయం చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే.. అంటూ నాజర్‌ ద్వారా పలికించడం సందర్భానుసారంగా వుంది. ఏది ఏమైనా ఏది ఎందుకు జరుగుతుందనేది దానికి క్లారిటీ ఇస్తూ జరిగేదీ యాదృశ్చికం కాదు. అంతా కర్మానుసారంగా జరుగుతుందనే కర్మ సిద్దాంతాన్ని ప్రబోధించాడు. చివరి అంకం మరింత ఆసక్తికరంగా వుంటుంది. వయస్సురీత్యా వచ్చిన కొన్ని తేడాలు మినహా రాజశేఖర్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సరిసమానమైన పాత్రను రాహుల్‌ రవీంద్ర మెప్పించాడు. 
 
తన పాత్రలో భయాన్ని, ఎంటర్‌టైన్‌మెంట్‌నూ, జర్నలిస్టు కోణాన్ని ఆవిష్కరించాడు. ఆదా శర్మ పాత్ర పరిధి మేరకే వుంది. మరో నాయిక నందితా శ్వేత సెకండ్‌ హాఫ్‌లో తన పాత్రకు న్యాయం చేసే అవకాశం దక్కించుకుంది. కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది పూజిత పొన్నాడ, ప్రతినాయకుడి పాత్రలో అశుతోష్‌ రానా, సిద్దు జొన్నలగడ్డ ప్రధానమైన పాత్రల్లో తమదైన నటనతో సినిమాకు ఆకర్షణగా నిలిచారు.
 
ఇంత భారీకథకు నేపథ్యసంగీతం ప్రధానమైంది. దాన్ని శ్రవణ్‌ భరద్వాజ్‌ బాగా ఇచ్చాడు. అయితే కథలో వైవిధ్యమున్నా ఒక్కసారి 'కెజిఎఫ్‌' చిత్రం గుర్తుకు తెస్తుంది. కథలో మలుపువు, ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు పాతకాలపు సినిమా ఫార్మాట్‌లో సాగడంతో ప్రేక్షకుడు కొంత ఫీల్‌ కాలేకపోతాడు. కథనం నిదానంగా నడవడంతో 3గంటలు సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. 
 
మధ్యలో నక్సలైట్‌ ఎపిసోడ్‌ రావడం కథలో ఇంకా ఏదో చెప్పాలనుకున్నట్లుగా వుండడంతో భారీ కథను క్లుప్తంగా ముగించేసినట్లుగా అనిపిస్తుంది. అందుకేనేమో కల్కికి సీక్వెల్స్‌ కూడా తీయవచ్చని ప్రమోషన్‌లో చిత్ర యూనిట్‌ పేర్కొంది.  
 
ఇక సినీమాటోగ్రపీ తోపాటు ప్రొడక్షన్‌ డిజైన్‌ బాగుంది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆలోచనా విధానం బాగున్నా దాన్ని మరింత ఆకర్షించేవిధంగా  తెరపై తీయాల్సింది. స్క్రీన్‌ ప్లే కేవలం సెకండ్‌ హాఫ్‌లో మాత్రమే అలరిస్తుంది. సినిమా పతాక సన్నివేశాల్లో మాత్రం ఉత్కంఠ కలిగే మలుపులతో సినిమా ముగించి ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలయ్యేలా చేశాడు. సస్పెన్స్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'కల్కి' ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లిన వారికి వినూత్నమైన అనుభూతిని కల్గిస్తుంది. తెలుగు తెరపై మరో కొత్త ప్రయోగంగా చెప్పవచ్చు.
 
రేటింగ్‌.. 5కు3

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు