పండగ సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులతో పాటు తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాణికులకు, తిరుమల శ్రీవారి భక్తులకు అనువుగా ఉండేలా ఈ ప్రత్యేక సర్వీసులను నడుపనుంది.
ఇందులోభాగంగా తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి (07637) ప్రతి ఆదివారం ఒక సర్వీసును నడపనున్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ - తిరుపతి రైలు (07638) ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు షిర్డీలో ప్రారంభమై, బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు తిరుపతికి వస్తుంది.
అలాగే తిరుపతి నుంచి జల్నాకు (07610) ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 3:50 గంటలకు జల్నాకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జల్నా - తిరుపతి రైలు (07609) ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జల్నాలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు ఏపీలోని రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.
అలాగే, చెన్నై - షాలిమార్, కన్యాకుమారి - హైదరాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. పండగ రద్దీని నియంత్రించేందుకు ఈసారి మొత్తం 470 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 170 రైళ్లు పూర్తిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తుండగా, మిగిలినవి ఇతర రైల్వే జోన్‌ల నుంచి ఈ మార్గంలో ప్రయాణిస్తాయని స్పష్టంచేశారు.