సాంకేతిక సిబ్బంది: దర్శకత్వం: నితిన్, భరత్, సంగీత దర్శకుడు: రాధన్, సినిమాటోగ్రాఫర్: ఎంఎన్ బాలరెడ్డి, ఎడిటర్: కోదాటి పవన కల్యాణ్, నిర్మాణం: మాంక్స్ అండ్ మంకీస్ బేనర్.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో ప్రదీప్ మాచిరాజు మైత్రీమూవీస్ ద్వారా ఈ రోజే థియేటర్లలోకి వచ్చాడు. కొత్త నటి దీపికా పిల్లి నాయికగా నటించిన ఈ చిత్రం ఓ గ్రామానికి ఇంజనీర్ వెళితే అక్కడ ఆచారవ్యవహారాలతో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అన్న పాయింట్ తో తన స్నేహితులే నిర్మాతగా తీశామని ప్రదీప్ వెల్లడించారు. పూర్తి వినోదాన్ని ఇచ్చామని చెబుతున్న ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
హైదరాబాద్‌కు చెందిన సివిల్ ఇంజనీర్ కృష్ణ (ప్రదీప్ మాచిరాజు)కు చిన్నతనంనుంచి ఎదుటివారికి సాయంచేస్తే రివర్స్ అవుతుంది. దాంతో ఎవరికీ ఎప్పుడూ సహాయం చేయకూడదని ఫిక్స్ అవుతాడు. వాళ్ళ బాస్ ఓ ప్రోజెక్ట్ కట్టమని ఊరికి పంపితే అది బెడిసికొడుతుంది. దాంతో కొత్త ప్రాజెక్ట్ అని చెప్పి అతన్ని భైరి లంక గ్రామానికి పంపుతాడు. అక్కడ బాత్రూమ్‌లు నిర్మించానికే వచ్చానని తెలుసుకుని షాక్ అయినా తప్పనిస్థితిలో చేయాల్సి వుంటుంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ వుంది.
ఆ గ్రామంలో ఒక విచిత్రమైన నియమం ఉంది: గ్రామంలోని ఏకైక అమ్మాయి రాజా (దీపికా పిల్లి)తో బయటి వ్యక్తి మాట్లాడకూడదు. చూడకూడదు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి పురుషుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. అందుకే ఊరి సర్పంచ్ ఆ ఊరిలో వున్న పెండ్లికాని 60 మంది చేత బాత్ రూమ్ లు కట్టించే పనికి తోడుగా వుండమని చెబుతాడు. వారితో పనిచేయించుకునే క్రమంలో ఊరికి చెందిన రాజా (దీపిక పిల్లి) క్రిష్ణ కు దగ్గరవుతుంది. గ్రామ నియమం బట్టి ఆ ఊరివారినే రాజాను పెండ్లిచేసుకోవాలనున్నా, కాదని క్రిష్ణను ఎలా చేసుకుంది? అసలు నియమం ఎందుకు పెట్టారు? క్రిష్ణ కు హాస్యనటుడు సత్య పాత్రకు లింకేమిటి? వెన్నెల కిశోర్, బ్రహ్మానందం పాత్రలు ఏమి చేశాయి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
మొదటి బాగం చాలా సరదాగా సరికొత్తగా సాగుతుంది. ఎక్కడా అనవసరమైన షాట్స్ కనిపించవు. పొందికగా అనుకున్నది అనుకున్నట్లు దర్శకులు తీయగలిగారు. ఆంద్ర, తమిళనాడు బోర్డర్ లో వున్న భైరి లంక గ్రామానికి రూల్స్ సర్పంచ్ ఎందుకు పెట్టాడనేది ఆసక్తిగా అనిపించినా, ఇలాంటి ఎక్కడైనా జరుగుతుందా? అనే డౌట్ కూడా వస్తుంది. అయితే కేరళలోని ఓ గ్రామంలో ఆమధ్య జరిగిన సంఘటన ఆదారంగా ఈ కథను రాశారని తెలుస్తోంది.
దానితోపాటు 2021లో తమిళ హీరో కార్తీ నటించిన సుల్తాన్ సినిమా ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అందులో హీరోను కాపాడేందుకు వందమంది అండగా వుంటే, ఈ సినిమాలో హీరోయిన్ ను కాపాడడానికి 60మంది కుర్రాళ్ళు వుంటారు. నేపథ్యాలు వేరయినా ఎంటర్ టైన్ మెంట్ గా దర్శకులు రాసుకున్న కథగా అనిపిస్తుంది.
ముఖ్యంగా మొదటి అర్ధభాగంలో. సత్య తన స్పాట్-ఆన్ కామెడీ టైమింగ్ తో షోను ఆకట్టుకున్నాడు. ఊరి కుర్రాళ్లలో గెటప్ శ్రీను అమాయక గ్రామీణుడిగా, కాస్త మెల్లకన్ను వున్నవాడిగా అలరించాడు. ఆడగెటప్ వేసినప్పుడు నీకు గెటప్ లు పిచ్చి అందుకే ఇలా నాకు దొరికిపోయావ్ అంటూ వెన్నెల కిశోర్ చేత డైలాగ్ కూడా చెప్పాడు.
ప్రదీప్ మాచిరాజు మంచి నటనను కనబరుస్తాడు, తేలికపాటి హాస్యాన్ని బాగా నిర్వహిస్తాడు. దీపికా పిల్లి ఆత్మవిశ్వాసంతో అరంగేట్రం చేయడంతోపాటు ప్రదీప్ తో తెరపై ఆహ్లాదకరమైన సంబంధాన్ని పంచుకుంటుంది.
సెకండాఫ్ లో కథ కాస్త సిటీకి మారి సినిమాటిక్ గా 60మందికి వివిధ ఫ్లాట్లో మకాం వేయించడం, వారందరికి తనే పెండ్లిచేయించాలనే క్రమంలో దర్శకుడు క్లయిమాక్స్ లో తెలివిగా ఆడవాళ్ళను ఎత్తుకెల్ళే ముఠాకులింక్ కలిపి ఈజీగా కథను ముగించాడు.
ఈ క్రమంలో కొన్ని లాజిక్ లేని విషయాలు కూడా వున్నాయి. కథనం నెమ్మదిస్తుంది. కథాంశం పెద్దగా విలువను జోడించని సన్నివేశాలతో సాగదీయడం ప్రారంభమవుతుంది. క్లైమాక్స్‌లో పెద్ద ఎమోషన్ లేదు. ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్ ఫార్ములాతో లాగించేశాడు.రెండవ భాగంలో కామెడీ తగ్గిపోయి కొన్ని సన్నివేశాలు సంబంధం లేకుండా అనిపిస్తాయి. వెన్నెల కిషోర్ పాత్రకు అండర్ రైటింగ్ ఉంది. బ్రహ్మానందం, జాన్ విజయ్ వంటి అనుభవజ్ఞులైన నటులు కూడా సరిగ్గా ఉపయోగించుకోబడలేదు. కొన్ని జోకులు విఫలమవుతాయి.
సాంకేతికంగా చూస్తే, దర్శకులు నితిన్, భరత్ ద్వయం ఒక ఆహ్లాదకరమైన, క్లీన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడంలో విజయం సాధించారు, ఇది ఆశాజనకమైన ప్రారంభంతో ఉంటుంది. కానీ రెండవ భాగంలో స్క్రీన్‌ప్లేపై మంచి దృష్టి పెట్టినట్లయితే సినిమా మరింత మెరుగ్గా ఉండేది.
రధన్ ఉల్లాసమైన మరియు సందర్భానికి తగిన సౌండ్‌ట్రాక్‌ను అందించాడు. MN బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ గ్రామ వాతావరణాన్ని బాగా సంగ్రహిస్తుంది. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంమీద, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కాస్త వినోదాత్మకంగా ఉంటుంది. సత్య, గెటప్ శ్రీను కామెడీ మొదటి భాగంలో బాగానే సాగుతుంది, రెండవ భాగం నెమ్మదిస్తుంది. ప్రదీప్ మాచిరాజుకు ఈ సినిమా ప్లస్ అవుతుందనే చెప్పాలి.