సాంకేతికత- సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, సంగీత దర్శకుడు: థమన్ ఎస్, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట, దర్శకత్వం : పరశురాం పెట్ల.
విడుదల తేదీ : మే 12, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం ఈరోజే విడుదలైంది. కరోనా టైంలో సరిలేరు నీకెవ్వరు చేసిన తర్వాత ఇంతకాలం గేప్‌తో వచ్చిన ఈ సినిమా కళావతి.. పాట విడుదలకు ముందే హైలైట్ కావడంతోపాటు ట్రైలర్‌తో మహేస్ డైలాగ్స్, యాక్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
మహేష్ ఉరఫ్ మహి (మహేష్ బాబు) అమెరికాలో లోన్లు ఇస్తూ రికవరీ బిజినెస్ చేస్తుంటాడు. అతని అనుచరుడు వెన్నెల కిశోర్. డబ్బు విషయంలో చాలా నిక్కచిగా వుండే మహిని బోల్తాకొట్టి ఎటువంటి షూరిటీ లేకుండా కళావతి (కీర్తి సురేష్) 10 వేల డాటర్ల లోన్ తీసుకుంటుంది. అది చాలదన్నట్లు మరో 25వేల డాలర్లు కూడా తీసుకుంటుంది. దానికి కారణం మహి.. కళావతిని గుడ్డిగా ప్రేమించడమే.
ఆ తర్వాత పరిణామాల వల్ల కళావతి ఒట్టి అబద్దాలకోరు అని తెలిసి ఆమె నుంచి డబ్బుఇవ్వాలని నిలదీస్తే నీ దిక్కునచోట చెప్పుకో అంటూ సవాల్ చేస్తుంది. దాంతో ఇగో హర్ట్ అయిన మహి నేరుగా వైజాగ్ వచ్చి కళావతిని నాన్న రాజేంద్రనాథ్ ( సముద్రఖని)ని అడుగుతాడు. అతను వైజాగ్‌లో ఎం.పి.. తను కూడా అదే మాట అంటాడు. దాంతో మహి ఆవేశానికి పోకుండా కూల్‌గా వేసిన ప్లాన్ ప్రకారం అతనికి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు రూపాయి అంటే మహికి ఎందుకంత ఇష్టం. దీని వెనుక కథేమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ
ట్రైలర్లోనూ, పబ్లిసిటీలోనూ చెప్పినట్లుగా ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమా. అయితే దర్శకుడు పరశురామ్ కథలో ఎంతో ఫ్రీడమ్ తీసుకున్నట్లుగానే యాక్షన్లోనూ తీసుకున్నాడు. మరోవైపు థమన్ మ్యూజిక్‌గా అంతే ఇదిగా ఇచ్చాడు. మహి వాళ్ళ నాన్న నాగబాబు చనిపోతూ ఒక్క రూపాయి ఇస్తే, ఆ తర్వాత కట్ చేస్తే యు.ఎస్.లో లోన్ ఇచ్చే బ్యాంక్‌ను స్థాపించేస్తాడు. ఇది కథలోని ఫ్రీడమ్. లాజిక్‌గా చూస్తే చాలా మటుకు సూటుకాదు.
- కానీ ఓ సీరియస్ పాయింట్‌ను ఇలా చెబితేనే బాగుంటుందని దర్శకుడు, హీరో చేసే ప్రయోగమే ఈ సినిమా. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్న రాజకీయ నాయకుడుని హీరో ఎలా మార్చాడో ఇందులోనూ అదే తీరుగా ముగింపు వుంటుంది.
- ఈ సినిమాలోని ప్రధాన అంశం వేల కోట్ల రుణం తీసుకుని బ్యాంక్‌లకు ఎగొట్టి దర్జాగా తిరుగుతున్న రాజకీయనాయకులను బేస్‌చేసుకుని రాసుకున్న కథ.
- అదే సామాన్యుడు ఇంటి అవసరాలకోసం లోన్ తీసుకుంటే 50 వేలయినా ముక్కిపిండి వసూలు చేయడమే కాకుండా బెదిరించి చివరికి ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకెళతారు. అందుకే మనకు తెలీని రైతుల ఆత్మహత్యల వెనుకల బ్యాంక్ వారు చేసిన హత్యలే అంటూ ఇందులో దర్శకుడు గట్టిగా చెబుతారు.
- భారతదేశంలో అధికారపార్టీ ఎం.పి.గా వుండి ఢిల్లీలోని నాయకులకు తను తీసుకున్న వేల కోట్ల లోన్‌ను కుక్క బిస్కెట్లగా వేస్తే చాలు. అందరూ తనను కాపాడాతారనే పాయింట్‌ను ఎం.పి. పాత్ర ద్వారా చూపించాడు.
- ఇది వర్తమాన భారతదేశ చరిత్రే. వేలకోట్ల ఎగొట్టి విదేశాలకు పారిపోయిన చాలామంది గురించి ప్రజలకు, ప్రభుత్వాలకు తెలుసు. కానీ ఏమీ చేయలేని దుస్థితి. అందుకే సామాన్యుడిగా వారినుంచి ఎలా కట్టించాలనే దిశగా రాసుకున్న కథ ఈ సినిమా.
- ప్రజలంతా కోట్లు దోచుకున్న రాజకీయనాయకులు కడితేనే మేమూ కడతామని గట్టిగా చెబితే దేశం బాగుపడుతుందని పాయింట్‌ను హైలైట్ చేశాడు. ఇది లాజిక్‌గా సాధ్యపడదు కాబట్టి. ఒక మంచి పర్పస్ కోసం చేసిన సినిమా.
- మహేష్‌బాబు తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. కీర్తి సురేష్ బాగానే చేసింది. ఇలా ప్రతివారూ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
- డైలాగ్స్ పరంగా చిన్నచిన్న విషయాలు బాగా హైలైట్ చేశాడు దర్శకుడు. చిన్నతనంలో నాన్న స్ట్రాంగ్‌గా వుండేవారు ఎవరు నాన్నా అంటే.. అప్పులేనివాడు. ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేసేవాడు అని నాగబాబు హీరోకు చెబతాడు. ఆ లాజిక్‌తో రికవరీ ఏజెంట్‌గా హీరో పాత్ర వుంటుంది.
- డాలర్ విలువ మన దేశంలో 72 రూపాయలు. అందుకే నామీద దౌర్జన్యం చేస్తే 72సార్లు కొడతాంటూ యాక్షన్ సీన్లో పలికే డైలాగ్‌లు ఫ్యాన్స్ అలరిస్తాయి.
- పాటలపరంగా కళావతి, మ..మాస్.. పాటలు బాగున్నాయి. అయితే వెండితెరపై అంత ఎఫెక్ట్‌గా అనిపించకపోవడానికి కారణం పాట నేపథ్యం సింక్ కాకపోవడమే.
- హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారనే మహేష్ మాటల్లో సగం నిజం వుందనిపిస్తుంది.
- అలా అని మైనస్‌లు లేకపోలేదు.
- కీర్తి సురేష్ 10+25=35 వేల డాలర్ల అప్పుగా తీసుకుంటే.. సినిమా కథంతా 10వేల డాలర్లు తీసుకుందని చెబుతాడు.
కథ ఎంత ఫ్రీడం తీసుకున్నాడో సన్నివేశాలు అంతే ఫ్రీడంగా సినిమాటిక్‌గా మార్చేశాడు. అసలు ఈ కథలోని పాయింట్ ఇప్పుడు జరుగుతున్న దేశంలోని సంఘటనలు. దాన్ని సిల్లీగా చెప్పే ప్రయత్నం చేశాడు. పరుశురామ్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీతో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.
మహేశ్ బాబు తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగా అలరిస్తారు. ఓవరాల్ గా ఈ చిత్రం మహేష్ బాబు ఫాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
సందేశం-
లోన్ కట్టకపోతే సామాన్యుడి ఆస్తులు జప్తు చేయడానికి వేసే వేలం పాట (సర్కారువారిపాట) వేల కోట్లు తీసుకున్న పెద్దలకూ వేయాలని చెప్పే చిత్రమే ఇది.