నటీనటులు: శ్రీ సింహా, మిషా నరాంగ్, చిత్ర శుక్లా, రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష,
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, ఎడిటింగ్: సత్య గిడుతూరి, సంగీతం : కాల భైరవ, నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని, దర్శకత్వం: మణికాంత్ జెల్లి.
తొలి చిత్రం మత్తు వదలరాతో నటుడిగా వెలుగులోకి వచ్చిన కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి మలి చిత్రంగా `తెల్లారితే గురువారం` చేశాడు. శనివారమే విడుదలైంది. మణికాంత్ జెల్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఆర్.ఎక్స్.100 దర్శకుడు అజయ్ భూపతికి తెలుసు. నీకు నచ్చితే చెయ్.. వేరే వాళ్ల గురించి నీకు ఎందుకు అని అన్నాడు. నా వెనకాల అజయ్ భూపతి గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారని.. దర్శకుడు మణికాంత్ తెలియజేశాడు. అలా ధైర్యంతో సినిమా చేసి ముందుకు వచ్చిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
కథ :
వీరు (శ్రీ సింహా కోడూరి)కి తెల్లారితో గురువారం అనగా పెళ్లి. బుధవారం రాత్రి గోడదూకి పారిపోవడానికి రెడీ అవుతాడు. అదే తీరుగా పెళ్లి కూతురు మధు (మిషా నారంగ్) కూడా పెళ్లి ఇష్టం లేక పారిపోతూ కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరినొకరు ఎందుకు పారిపోవాలనుకుంటున్నారో అనే దానిపై ఫ్లాష్‌బేక్‌లు చెప్పుకుంటారు. ఫైనల్‌గా స్నేహితుడి కారులో ఉడాయించేస్తారు. అలా ఎక్కడికి వెళ్ళారు? తర్వాత ఏం జరిగింది? చివరికి వారికి పెళ్లి అయిందా లేదా? అనేది సినిమా.
విశ్లేషణః
వయస్సులో వుండగా ప్రేమ, ఆకర్షణతోపాటు చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోవడానికి కూడా సిద్ధపడే అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది క్లుప్తంగా కథ. దీనికి కన్‌ఫ్యూజ్ కామెడీ అనే దినుసును జోడించి కథనం నడిపాడు దర్శకుడు. కన్‌ప్యూజ్ కామెడీని బాగా పండించింది సత్య పాత్ర. సినిమాలో ఆ పాత్రే బలం. మిగిలినదంతా పేలవంగా వుంది. దర్శకుడు కొత్తవాడు కావడంతో తనకు తోచిన విధంగా రాసేసుకుని కథనం నడిపాడు. ఎమోషనల్‌గా ఎక్కడా కనెక్ట్ కావడానికి అవకాశం లేని కథ ఇది.
ఇంతకుముందు మత్తువదలరాలో అమాయకత్వం, టెన్షన్ పడే పాత్రను మెప్పించిన శ్రీసింహా ఈసారి ఎమోషనల్, కన్‌ఫ్యూజ్ సన్నివేశాల్లో నటన పర్వాలేదు. హీరోయిన్ మిషా చిత్ర శుక్లా పాత్రలకు న్యాయం చేశారు. రాజీవ్ కనకాల, హర్ష అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
చిన్నపాయింట్‌ను తీసుకుని ఒక్కరాత్రిలో జరిగిన కథగా రాసుకున్నా దానిని ఆకట్టుకునేలా చేయలేకపోయాడు దర్శకుడు. ఎక్కడా ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్‌కాలేడు.సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్‌తో స్లోగా సాగుతూ బోర్ కొడుతొంది. ముఖ్యంగా సెటప్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అన్నీ పక్కా రొటీన్ గానే సాగుతాయి. హీరో డాక్టర్‌ను ప్రేమించే విధానం ఔడేటెడ్ ఫార్మెట్. హీరోయిన్ అసలు పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందనే కారణం లాజిక్‌గా వుంది. కానీ ఈ ఒక్క పాయింట్‌తో సినిమాను నిలబెట్టాలనుకోవడం తప్పిదమే. సెకండాఫ్‌లో అజయ్, మేకపిల్లను పెళ్లిచేసుకునే సీన్ అనేది బలవంతంగా హీరోయిన్‌లో మార్పుతీసుకురావాలని చేసినట్లుంది మినహా ఆ ఎపిసోడ్ బలహీనంగా వుంది.
సంగీత దర్శకుడు భైరవ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని విజువల్స్‌ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు, బలమైన సంఘర్షణ లేని ఫ్యామిలీ సీన్స్ రొటీన్ డ్రామా వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఇన్ని అంశాలున్న ఈ సినిమా ఇతరుల సంగతి మనకెందుకు తనకు నచ్చితే చాలనుకుని తీశాడు.