దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు.
ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో అంచనాలు పెంచేశారు. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
పీపుల్ మీడియా ఫాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో రామ్ చిత్రం రాబోతోంది. ఎన్నో ఆర్థిక కష్టాలను పడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను కొంత రషెస్ చూశాను. సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమానే అయినా సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. కంటెంట్ ఉంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు. మన సైనికులు, ప్రాణ త్యాగాల మీద చిత్రాలు వస్తుంటాయి. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రం తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్. వారి త్యాగాలను చూపించి అందరికీ మరోసారి వారి గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఎంతో నిజాయితీగా ఈ సినిమాను తీశారు. సాయి కుమార్, ధన్యా బాలకృష్ణ పాత్రలు బాగున్నాయి. మొదటి చిత్రం కావడంతో సూర్య తనను తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డారు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించారు. దేశ భక్తిని చాటే చిత్రంగా జనవరి 26న రాబోతోంది. ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి అని అన్నారు.
హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ, ఈ చిత్రానికి నలుగురు పిల్లర్స్‌గా నేను, డైరెక్టర్, కెమెరామెన్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్. నా స్నేహితులందరూ కలిసి ఫండింగ్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది ఉండదు. మొన్నే పెద్ద చిత్రాల మధ్యలో చిన్న సినిమా వచ్చి నిలబడింది. ఇప్పుడు కూడా పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రం రాబోతోంది. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. ఇక మున్ముందు రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. వందలో అరవై మందికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మిహిరామ్ గారికి థాంక్స్. భానుచందర్, సాయి కుమార్ గారికి థాంక్స్. ప్రతీ డైలాగ్ తూటాలా ఉంటుంది. క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. సినిమా బాగుంటే.. బాగుందని లేకపోతే బాగా లేదని చెప్పండి అని అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత దేశ భక్తిని చాటే చిత్రంలో నటించాను. మొదటి సినిమాతోనే ఇలాంటి జానర్‌ను ఎంచుకుని సూర్య చాలా కష్టపడ్డాడు. హీరో సూర్య, దర్శకుడు మిహిరామ్ ఇద్దరూ కృష్ణార్జునలుగా కలిసి ఎంతో కష్టపడి సినిమాను తీశారు. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. ఫైట్స్ అన్నీ బాగుంటాయి. డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమాను మా వంతుగా చేశాం. ఇక నిర్ణయం ప్రజలదే. కంటెంట్ బాగుంటే.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే సినిమాను ఆపలేరు. ఇప్పుడు అంతటా హనుమాన్ ఆడుతోంది. ఇప్పుడు ఈ రామ్ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.
దర్శకుడు మిహిరాం మాట్లాడుతూ, దేశ భక్తిని చాటి చెప్పే చిత్రమే కానీ, బార్డర్‌లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు. దేశసరిహద్దు లోపల టెర్రర్ అటాక్ బారి నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోల గురించి చూపించాను. మాకు ఇప్పుడు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. కానీ మంచి థియేటర్లను తెచ్చుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ గణేష్ ప్రయత్నిస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరించాలి. మంచి విజయాన్ని అందించాలి అని అన్నారు.
నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ, మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్‌లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామని అన్నారు.
ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ, సాయి కుమార్ గారితో నటించడంతో లైఫ్ సర్కిల్ కంప్లీట్ అయినట్టుగా అనిపించింది. సూర్య, దీపికలు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు. దర్శకుడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. మా చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలి అని అన్నారు.