'అబ్బ ఎన్ని రోజులండి.. మనకీ బాధ. మన మాట వినని మనిషితో ,మనం చెప్పినట్టు చేయని మనిషితో ఇక వేగలేను. ఏదైనా మంచి వృద్ధాశ్రమం వుంటే చూడండి. అదే కరెక్ట్..' అంటూ కోడలు రవితో అన్న మాటలు తన చెవిన పడినప్పటి నుంచి ఏదో అస్తిమితం. చెప్పలేని బాధ. ఒక్కసారిగా తన మనసు దొంతరలు తెరుచుకుని గతంలోకి తొంగి చూసింది.
పాతికేళ్ల క్రితం ఇంచుమించు అవే మాటలు తన పదేళ్ళ కొడుకు తన మాట వినట్లేదని భార్యతో 'లక్ష్మీ..! నా మాట విను. మన మాట వినని ,మనం చెప్పినట్లు చేయని, క్రమశిక్షణ లేని వీడ్ని ఏదైనా మంచి హాస్టల్లో వుంచడమే కరెక్ట్' అంటూ భార్య వద్దన్నా వినకుండా పట్టుబట్టి హాస్టల్లో వేశాడు. చేరబోయే ముందు రవి పడ్డ ఆవేదన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే వుంది.
సరిగ్గా తిండి తినేవాడు కాదు. నిద్ర పోయేవాడు కాదు. మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ ఏదో పరధ్యానం. బాధగా వుండేవాడు. ఇదే అస్తిమితం. అయినా తాను హాస్టల్లో రవిని వేసి తన మాట నెగ్గించుకున్నాడు. రవి చివరివరకూ ఎంతో బతిమలాడాడు. 'నాన్నా! నీ మాట వింటాను, నీవు చెప్పినట్టు వుంటాను. బాగా చదువుతాను. కానీ మీకు దూరంగా మాత్రం వుండలేను. నన్ను హాస్టల్‌కు పంపవద్దంటూ వేడుకున్నాడు. కానీ తన మనసు కరగలేదు. అనుకున్నది చేశాడు.
ఇప్పుడు అదే దృశ్యం, కాని కోడలి మాటలకి కుమారుడు రవి మౌనంగా వుండడం. ఏదో భయం. కానీ తానేం చేశానని, వాళ్ళు ఇంత బాధ పడుతున్నారు. ఏ పనీ చేయకుండా ఓ మూలన వుండడం తనకు ఇష్టం లేదు. అది తినకూడదు,ఇది వద్దు అంటూ ఏవేవో ఆంక్షలు. ఎంత జాగ్రత్తగా వున్నా నీడలా వెంటాడే అనారోగ్యం. ఇది తన తప్పా? వయసు తప్పా? మందులకు వేలకు వేలు పోయలేం అంటూ తాను ఆధారపడుతున్న విషయాన్ని సూటీపోటి మాటలతో కోడలు గుర్తుచేయడం. ఏమన్నా అంటే మాట వినని మనిషి, చెప్పినట్టు చేయని మనిషి.....అంటూ మొదలు.
ఆ మాటలు విన్నప్పుడు ఎందుకో పాతికేళ్ళ క్రితం రవి నాతో అన్న మాటలే తిరిగి వాడితో అనాలని వుంది. 'బాబు! నన్ను దూరంగా పంపించవద్దు. మీరు చెప్పినట్టు వుంటాను, మీ మాట వింటాను. కానీ మీకు దూరంగా వుండలేను.' అయినా తన కొడుకు తనలా పట్టుబట్టి అనుకున్నది చేస్తే. అమ్మో! ఆ ఊహే భరించ లేకుండా వుంది. ఎందుకో రాత్రంతా లక్ష్మి జ్ఞాపకాలు మదిలొ మెదులుతూ వున్నాయి. తన మనసు పంచుకునే మనిషి వుంటే బావుండేదని మనసులో బాధ.
దేవుడా..! ఒక్క అవకాశం ఇవ్వు అంటూ వేడుకున్నాడు. రవి కూడా పాతికేళ్ళ క్రితం తనని హాస్టల్లో వేసే ముందు ఇలానే వేడుకుని వుంటాడు. ఇలా రకరకాల ఆలోచనలతో మగతగా నిద్ర పట్టింది.
అంతలోనే తెల్లవారింది. ఎదురుగా రవి. "పద నాన్నా! త్వరగా తయారవ్వు." అన్నాడు. "ఎక్కడికి బాబూ?' అంటూ మనసులోని భయాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాను. 'నాన్నా! ఈ రోజు నీ అనారోగ్యానికి చికిత్స చేసే పెద్ద డాక్టర్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. అతను మంచి పేరున్న డాక్టరు" అంటూ నా చేయి పట్టుకుని చెప్తుంటే, ఏదో తెలియని పశ్చాత్తపం... ఓ ఓదార్పు... ఓ భరోసా...
ఇదే భరోసా పాతికేళ్ళ క్రితం రవి తన నుంచి కోరుకుని వుంటాడు. కానీ తన కొడుకు తనలా కఠిన హృదయుడు కాదు. తన లక్ష్మిలా సున్నిత మనస్కుడు. కానీ లక్ష్మి మనసు తాను అర్థం చేసుకునే లోగానే తనువు చాలించింది.
'ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదన్న సూక్తి నా జీవితంలో నిజం కాకూడదని ఆశిస్తూ... రవితో బయలుదేరా... జీవితంపై కొత్త ఆశలతో...