"నాగమల్లె కోనలోనా... నక్కింది లేడి పిల్ల.. అ... ఎరవేసి.. గురిచూసి పట్టాలో మావ.. పట్టాలోయ్ మావ..." ఈ పాట ఏ చిత్రంలోనిదో తెలియదు కానీ మా ఊరుకి కూతవేటు దూరంలో ఉండే మద్దిబోయినవారి పాలెం తాళ్లతోపు నుంచి వేసవికాలంలో రీసౌండ్ చేస్తూ వెన్నెల రాత్రులందు వినిపించేది. ఆ గొంతు తాగుబోతు రోశయ్యది.
పీకలదాకా పూటుగా తాగిన తాగుబోతు రోశయ్య నిషా తలకెక్కడంతో ఇలా పల్లవినందుకుని రోడ్లపై తైతక్కలాడుతూ స్వరం పెంచి దిక్కులు పిక్కటిల్లేలా పాడుతూ ఉండేవాడు.
నాగమల్లి పాటే కాదు... అలనాటి పాతతరం మనసు దోచిన పాటలను తనదైన స్టయిల్లో పాడేవాడు. ఇక ఉదయం వేళల్లో అయితే సమయం 11 గంటలైతే చాలు... రోశయ్య గాత్రం కల్లు కుండల సమీపం నుంచి బ్రాడ్‌కాస్ట్ అయ్యేది. అతడు ఎక్కువగా ఉమ్మడి బొందలు అనే ఓ తాడిచెట్లతోపు ఆవరణలోని తెల్లని ఇసుక దిబ్బపై కల్లు కుండను ఎదురుగా పెట్టుకుని తాగుతూ తూగుతూ రాగాలు తీస్తుండేవాడు.
అన్నట్లు ఆ ఉమ్మడి బొందలు మావే. మా ఊరులోని తరతరాల సంపద ఆ ఉమ్మడి బొందలు. ఊరి తరపున నిర్వహించిన వేలంపాటలో మా నాన్నగారు( రిటైర్డ్ హెడ్ మాస్టర్) 270 తాడిచెట్లున్న ఆ తోపును పాడి గెలిచారు. అప్పట్లోనే అధిక ధర చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు.
ఇప్పుడంటే కాంక్రీటు, రేకులు, పెంకులు అంటూ ఇల్లు పైకప్పు వేసుకోవడానికి సాధనాలు వచ్చాయి.. కానీ అప్పట్లో మా ఊళ్లో అన్నీ తాటిఆకు పూరి పాకలే. ఇల్లు కట్టాలంటే తాటిచెట్టు అవసరం 90 శాతం. తాడిచెట్టు లేనిదే మా ఊళ్లో ఇల్లు నిర్మించడం దుర్లభం. అందుకే కామోసు... మా ఊరు ఊరంతా ఆ తాటిచెట్టు తోపుకోసం మహా పోటీపడిందట. ఆ వేలం జరిగినపుడు నేనసలు పుట్టనే లేదు.
ఆ సంగతి అలా ప్రక్కనపెడితే... ఈ 270 తాడిచెట్లు మావేనని తెలుసుకున్న రోశయ్య(రిటైర్డ్ మిలట్రీ ఉద్యోగి) నేరుగా మా నాన్న వద్దకు వచ్చాడు. ఆ రోజు...
"పొంతులుగారూ... మీ చేతుల్లోనే ఉంది నా పేణం. గొంతులో చుక్క కల్లు పడందే బొందిలో ఉన్న పేణం నిలవదు. మీరు నే సెప్పేదానికి ఊ అనాల్సిందే.. " అంటూ తాను కల్లు తాగేందుకు రెండు తాడి చెట్లను ఇవ్వాల్సిందిగా అడిగాడు.
"తాగితే చస్తావురా... వచ్చే పింఛన్‌ను నీ భార్యా పిల్లలకు కాకుండా ఇలా తాగుడుకు తగెలెస్తున్నావ్. కల్లు లేదూ... గిల్లూ లేదూ వెళ్లు...వెళ్లు.." అన్నాడు మా నాన్న.
"తాగందే నేనుండలేను పొంతులుగోరూ... బాబ్బాబు.. నీ కాళ్లు పట్టుకుంటా... తాడిని ఇయ్యనని సెప్పమాకండి. ఇదిగో నే వెళుతున్నా... దిబ్బమీద తాడి గీయించుకుంటున్నా.." అంటూ మా నాన్న సమాధానాన్ని ఎదురు చూడకుండా ఇంటి నుంచి రోడ్డువైపు వడివడిగా వెళ్లడం మొదలుపెట్టాడు.
మా నాన్న మాత్రం... "తాడీ లేదు.. గీడీ లేదు... గీయంచావో నీ తాట తీస్తా..." అని బెదిరించాడు.. "పొంతులుగోరూ... మీరు నన్ను చంపినా సరే... " అని తూలుకుంటూ వెళ్లిపోయాడు తాగుబోతు రోశయ్య. ఆపైన ఏం మాట్లాడాలో తెలియక రోశయ్య వెళుతున్నవైపు అలా చూస్తుండిపోయాడు మా నాన్నగారు. రోశయ్య మాత్రం తాగిన నిషాలో రాగాలు తీసుకుంటూ మద్దిబోయినవారి పాలెం డొంక వైపు తూగుతూ వెళ్లిపోయాడు.