తెలంగాణా వొత్తందంటగా... అందుకే మా ఎకరం "కోటి"

WD
పిల్లకాలువలు, పచ్చని పైర్లు, పసిడి ధాన్య రాశులు.. అంటే మా నాకు మా ఊరు గుర్తుకు వస్తుంది. అప్పుడు బహుశా నాకు పదేళ్లు. మా పూరిపాక కిటికీలోంచి దృష్టి సారిస్తే వనదేవత నన్ను పలుకరించినట్లు పచ్చని ప్రకృతి. నేరేడు చెట్లు, నేల ఉసిరి చెట్లు, నక్కేరు చెట్లు, ఈత చెట్లు... ఇలా రకరకాల చెట్ల మధ్య వేరు శనగ పొలాలు.

వేరు శనగ పొలాలు మైలపూత( పసుపు వర్ణంలో ఉండే పూలు) శనగ చేను పిందెలు కాయడానికి సూచనగా వికసించి పలుకరిస్తుండేవి. అందుకే నా చిన్నప్పుడు ఏ కాస్త టైం దొరికినా నా స్నేహితులతో ఆ పంట ఒడిలో ఆడుకునేందుకు పరుగెత్తేవాళ్లం. ఆ సమయంలో మా ఊర్లో చదుకున్న కుటుంబాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.

మొత్తం 5వందల కుటుంబాలుంటే కేవలం ఐదారు కుటుంబాలు మాత్రమే చదువులపై శ్రద్ధ చూపించేవి. మిగిలిన కుటుంబాలది నిత్యం వ్యవసాయమే. భూమిని పచ్చగా ఉంచడమే వారి లక్ష్యం. ఆ పచ్చదనాన్ని పసిడి వర్ణంలోకి మార్చి ధాన్య రాశులను ఇంటికి తరలించడమే వారి ధ్యేయం.

అలా గడిచిన నా బాల్యపు రోజులు క్రమంగా కెరీర్ దృష్ట్యా హైదరాబాద్ నగరానికి చేరాయి. ఆ తర్వాత అప్పుడప్పుడూ మా ఊరికి వచ్చి వెళుతుండేవాడిని. నా బాల్యం నన్నెలా వీడిపోయిందో... అలాగే మా ఊరును పచ్చదనం కూడా వదిలి వెళ్లిపోయింది. ఇటీవల ఓ సందర్భంలో నా చిన్ననాటి స్నేహితుడు ఐదు లక్షల రూపాయల విలువ చేసే కారు కొన్నానని నా ఫోన్ నెంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చేసి చెప్పాడు. వీలుంటే ఒక్కసారి తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కాస్త వెసులుబాటు దొరకడంతో మా ఊరికేసి ప్రయాణమయ్యాను.

ఊరికి చేరువయ్యే రోడ్డు ఒకప్పుడు 30 అడుగులుంటే ఇప్పుడది 90 అడుగులైంది. ఒన్ వే ట్రాఫిక్. అప్పుడప్పుడూ ట్రాఫిక్ జామ్. మొత్తానికి అవన్నీ దాటుకుని మా ఊరులోకి ప్రవేశించాను. కుటుంబ పంపకాల్లో మా ఇల్లు కనుమరుగైంది. ఆ స్థానే పక్కా గృహాలు వెలిశాయి. నా సోదరుని ఇంట్లోకి వెళ్లి కిటీకి నుంచి బయటకు తొంగి చూశాను. పచ్చని పైర్లు కనిపించలేదు. అన్నీ కాంక్రీట్ గోడలే. ఎక్కడైనా ఖాళీ స్థలం కనబడితే, అక్కడ హద్దు రాళ్లతో ప్లాట్లు. మొత్తానికి పొలాలన్నీ ఇళ్ల ప్లాట్లుగా దర్శనమిచ్చాయి. ఆ కిటికీలోంచి అలా దీర్ఘంగా చూస్తుండగా...

"ఏంది... శీనుగా. సూత్తన్నావ్" అన్న మాటలు వినిపించే సరికి వెనుదిరిగాను. నా స్నేహితుడు. మాట మొరటుగా ఉన్నా... మనిషి మాత్రం నాకంటే ఫ్యాషన్‌గా మారిపోయాడు. "ఏందిరా.. ఆచ్చర్యపడిపోతున్నావ్. ఏందీ ఈ ఏసం అనా...? ఆ ఏం లేదూ... మావోడు గోలబెట్టి ఈ పేంటూ, సొక్కా కొనుక్కొచ్చి ఏసుకునే దాకా ఒకటే రొద. ఏం సేత్తా. ఏసుకున్నా. బాగుందా." అన్నాడు.

"బాగానే ఉందిరా.. ఇంతకీ ఏంటీ సంగతి. ఉన్నట్టుండి కారు, ఏదేదో కొనేశానంటున్నావ్. నీ తమ్ముడికి కనుక మంచి ఉద్యోగం వచ్చిందా" అన్నాను.
"ఉద్దోగం లేదు... సద్దోగం లేదు. సపోటా తూముల పక్కనున్న ఎకరం పొలం అమ్మేశా. ఆ అదేదో తెలంగాణా వొత్తందని ఒకటే గోల. అవిద్రాబాదోళ్లు(హైదరాబాద్) మొత్తం ఇటెగబడుతున్నారు. 10 లచ్చల కాడ్నించి బేరం మొదలయ్యింది. సివరికి ఎకరం కోట్రూపాలయలకెల్లింది. మావోడు ఒకటో గోల. నాలుగెకరాలున్నయ్. ఒకెకరం అమ్మేత్తే నీ సొమ్మేంపోద్దని. ఏం సేత్తా. ఒకటమ్మి ఓ మిద్దే, రెండు కార్లు కొన్నాం.

అయ్‌పోగా ఇంకా 40 లచ్చలున్నాయ్. బేంకులో ఏశా. మిగతా మూడెకరాలు ఇంకొకడు ప్లాట్లేత్తాం. లాభంలో సగం నీకు, సగం నాకు అంటుంటాడు. సూత్తన్నా." అన్నాడు.
"మరి వ్యవసాయం." అన్నాను
"ఓర్నీ మడిసి సల్లంగుండ. ఇంకెక్కడి ఎగసాయంరా... బాబూ. కాలవకట్టకవకాడకెల్లి ఓపాలి సూడు. పొలాలన్నీ ప్లాట్లే. ఎక్కడ సూసినా హద్దు రాళ్లే. ఎగసాయం లేదు... గిగసాయం లేదు" అన్నాడు.

అలా మా ఊరు 700 ఎకరాల పంట భూములు ఇళ్ల ఫ్లాట్లుగా దర్శనమిచ్చాయి. కానీ నా చిన్ననాటి పంట పొలాల పచ్చని దృశ్యాలు ఇంకా అలాగే నా మస్తిష్కంలో ఉన్నాయి. మొత్తానికి ఆ పంట పొలాలు ఓ జ్ఞాపకంగా మిగిలిపోవడం బాధగా అనిపించింది. భారంగా ఆ భూములను చూస్తూ తిరుగు పయనమయ్యాను.

వెబ్దునియా పై చదవండి