కల్పవృక్ష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి

తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం మలయప్ప స్వామి కల్పవృక్షంపై ఊరేగారు. కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షంపై వెంకన్న ఊరేగుతూ... సకలజీవరాశులకు "నేనున్నానని" అభయమిస్తూ మాడవీధుల్లో భక్తులకు కనువిందు చేశారు. సర్వాలంకార భూషితుడైన తిరుమలేశుడు శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కల్పవృక్షంపై ఆసీనుడై విహరించిన వైనాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో తేలియాడారు.

ఇకపోతే... శనివారం రాత్రి సర్వభూపాల వాహన సేవ వైభవంగా జరుగనుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మొదటి స్నపన తిరుమంజన వేడుక ఘనంగా జరుగనుందని టీటీడీ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత మూడు రోజులుగా తిరుమల కొండ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతోంది. దసరా సెలవులు, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో... పెద్ద ఎత్తున వెంకన్న ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. భక్తులకు అసౌకర్యం కలుగనీయకుండా, సదుపాయాలను కల్పించేందుకు టీటీడీ ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి