శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన సోమవారం రాత్రి మలయప్పస్వామి గజవాహనారూఢుడై తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. గజ, తురగ, అశ్వ, పదాతి దళాలు ముందుకు సాగగా, వేలాది భక్తులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించుకున్నారు.
ఆలయంలో విశేష సమర్పణ అనంతరం స్వామి వారు వాహన మండపం చేరుకుని, దివ్యపురుషుడిగా అలంకృతమై గజవాహనాసీనుడై మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని దర్శించుకునేందుకు అశేష జన ప్రవాహిని తిరుమల కొండకు తరలి వచ్చింది.
అనాది కాలం నుంచి సుప్రసిద్ధ వాహనంగా పరిగణించబడే గజవాహనంపై స్వామి వారు ఊరేగుతూ సకల జీవరాశులను రక్షించేందుకు నేనున్నానని బోధిస్తూ వేంకటేశ్వర స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు.
అంతకుముందు (సోమవారం సాయంత్రం) స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. బంగారు రథాన్ని మహిళా భక్తులే లాగడం ఆనవాయితీగా వస్తున్న ఈ స్వర్ణరథంపై శ్రీవారు ఊరేగిన తీరును తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకున్నారు.
అదేవిధంగా సోమవారం ఉదయం స్వామి వారికి హనుమంత వాహన సేవ జరిగింది. దాస భక్తి ప్రాముఖ్యాన్ని చాటే విధంగా తనను సకల జీవరాశులు శరణుకోరాలని బోధిస్తూ స్వామి వారు హనుమంత వాహనంపై ఆసీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
ఉత్సవాల్లో ఏడోరోజైన మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో స్వామి వారికి సూర్య ప్రభ, రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యలో చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్నపన తిరుమంజన వేడుక జరుగనుంది.