తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరిపై శ్రీవారు

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధమనోహర రూపంలో ఉభయ దేవేరులతో కలసి ముత్యపు పందిరిలో ఆశీనులై నాలుగు మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు కనువిందు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామికి జరిగే సుకుమార సేవ ముత్యపు పందిరి వాహనం. ముత్యాలతో రూపొందించిన పందిరి వాహనంలో తాండవ కృష్ణుని రూపంలోని స్వామివారిని ముచ్చటగా ఊరేగించారు.

తొలుత ఉత్సమూర్తులు రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో ఊయలపై సేద తీరారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో వైభవంగా ఊరేగారు.

ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. ఉత్సవ శోభల్లో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి

వెబ్దునియా పై చదవండి