బ్రహ్మ సాక్షిగా.. భక్తులు తరలివచ్చే... బ్రహ్మోత్సవాలు....
File
FILE
'కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ'పై... వెలసిన వెంకటేశ్వరుడు సకల సింగారాలతో, సిరిసంపదలతో స్వర్ణరథంపై ఊరేగుతుండగా... జనసంద్రం అలలు అలలుగా తెరలు తెరలుగా ముందుకు కదులుతూ ఉంటే తిరువీధులు వైభవ శోభితం వర్ణనాతీతం. చీమల్లా పరుచుకున్న మహాజన సముద్రపు వేదికపై బ్రహ్మ దగ్గరండి ఆ వేంకటేశ్వరుడి ఊరేగింపును నడిపిస్తుంటే ముక్కోటి దేవతలు ఆ బ్రహ్మోత్సవ మురిపాన్ని చూడటానికి మూకుమ్మడిగా తరలివస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ భక్త ప్రపంచానికి పండగ రోజులే!
వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు దగ్గరుండి ఉత్సవాలు నిర్వహించారట. అందువల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందినట్టు భవిష్యోత్తర పురాణం చెపుతోంది.
చరిత్రలో ఎందరో రాజులు తమ విజయ పరంపరకు చిహ్నంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఒక్కోసారి నెలకొకరు చొప్పున ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించుకనేవారు. స్వామి ఊరేగే వాహనసేవల సంఖ్యను బట్టి రోజుల సంఖ్య మారుతూ వచ్చింది. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా బ్రహ్మోత్సవాలు నేటికి నిర్విఘ్నంగా సాగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఏటా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ యేడాది ఈనెల 29వ తేదీ నుంచి అక్టోబరు ఏడో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ తిరుమల దివ్యక్షేత్రం కలియుగ వైకుంఠమై కన్నుల పండుగలా కనిపిస్తుంది. అందుకేనేమో అన్న మాచార్యుడు 'నానా దిక్కులెల్ల నరులెల్ల వానరులతోనే వత్తురు కదిలి' అంటూ బ్రహ్మోత్సవాలను కీర్తించారు.
అంకురార్పణ ఘట్టంతో ఆరంభం... ఈ బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మంటపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంనందు లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే 'మ్రిత్సవం గ్రహణం' అంటారు.
యాగశాల్లో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో (కుండలు) - శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రయంగు మొదలగు నవధాన్యాలను పోసి ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలు... తేది: 29-9-11. ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం. తేది: 30-9-11. ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనం. తేది: 01-10-11. ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపుపందిరి వా. తేది: 02-10-11. ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనం. తేది: 03-10-11. ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం తేది: 04-10-11. ఉదయం హనుమ వాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రి గజవాహనం తేది: 05-10-11. ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం తేది: 06-10-11. ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం తేది: 07-10-11. ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం