శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
జంతువులకు రాజైన సింహం సైతం తానేనని, మనుషులు తమలోని జంతు ప్రవృతిని అదుపు చేసుకోవాలనే సందేశాన్ని చాటిచెప్పే ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. అత్యంత సుందరంగా అలంకృతమై, సింహంపై గంభీరంగా నాలుగు మాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగిన వైనం భక్తులను కనువిందు చేసింది.
మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు దివ్య సుందరంగా ముత్యపుపందిరి వాహనంపై విహరించనున్నారు. సుకుమార సేవగా చెప్పబడే ముత్యపు పందిరి వాహనంలో మలయప్ప ఊరేగే అందాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఏడు కొండలకు తరలివస్తున్నారు.