బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన సోమవారం తిరుమలేశుడు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగిన వైభవాన్ని భక్తకోటి తిలకించి ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. అశేషభక్తజన సందోహంతో కిక్కిరిసిన తిరుమల కొండ గోవింద నామస్మరణతో దద్ధరిల్లింది. సాంప్రదాయ బద్ధమైన కోలాటాలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ శ్రీవారు దివ్యపురుషుడుగా స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు.
ఇకపోతే... ఆరోరోజైన సోమవారం రాత్రి స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో విహరించి భక్తులను మురిపించనున్నారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ ఈ గజవాహన సేవ జరుగుతుందని శాస్త్రోక్తం.
ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేనని లోకానికి బోధించే రీతిలో భక్త జనులకు అభయమిస్తూ తిరుమాడ వీధుల్లో శ్రీవారు ఊరేగనున్నారు. భక్తజనుల మొరల్ని వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచేందుకు ఈ గజ వాహన సేవ జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం మలయప్ప స్వామి హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు.