శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం మలయప్పస్వామి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శేషుడు నారాయణాంశ సంభూతుడు. విష్ణువు యొక్క అపరదేహం, ఐదు పడగలు కలిగిన ఈ వాహనంలో రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహం తిరుమలలో కొంతకాలం ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందుకు గౌరవ సూచికంగా రెండవ రోజు ఉదయం స్వామి వారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని చెబుతుంటారు.
చిన్నశేషవాహనంపై వేంకటేశ్వరుడు మురళీ మనోహారుడు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పెద్దశేషవాహనాన్ని అదిశేషుడిగానూ, చిన్నశేష వాహనాన్ని వాసుకి సర్పంగానూ భక్తులు భావిస్తారు. ప్రతి మనిషిలో ఉండే మనోవైకల్యాలు సర్పాకారంలో వ్యాపించి ఉంటాయి. చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడిని దర్శించి, ధ్యానించడం ద్వారా మనిషిలోని మనోవైకల్యాలు నశిస్తాయి.
వ్యక్తిలోని కుండలిని సర్ప రూపపు శిరస్సు, సహస్రాకారంలోనూ పుచ్చం మూలదారంలోనూ నిల్చిననాడు మనిషి నిజంగా మాధవుడికి నిజమైన సేవకుడవుతాడు. చిన్నశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.