తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన బుధవారం మహారథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామిని దివ్య స్వరూపుడిగా అలంకరించి మహారథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీవారు తన దేవేరులతో కళ్యాణ వేంకటేశ్వరుడిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. సుప్రభాత సేవల అనంతరం ఉభయ నాంచారీ సమేత మలయప్పను రథమంటపానికి వేంచేపు చేశారు.
బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన శ్రీవారి రథోత్సవం 3 గంటలపాటు ఘనంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన రథోత్సవంపై మలయప్ప స్వామి ఊరేగిన వైభవాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు.
ఇకపోతే... బుధవారం రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివారికి ఆలయ రంగనాయకుల మంటపంలో విశేష సమర్పణ గావించారు. అనంతరం ఊంజల్ మంటపానికి చేరుకున్న వెంకన్నకు కన్నుల పండుగగా ఊంజల్ సేవ జరిగింది.
ఊంజల్ సేవకు తర్వాత వాహన మంటపానికి చేరుకున్న బ్రహ్మాండనాయకుడిని అశ్వ వాహనంపై అధిరోహించి రాత్రి 9గంటల నుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అశ్వవాహనంపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఊరేగిన మలయప్ప స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. కొత్త పెళ్లి కొడుకువోలె అశ్వవాహనంపై మలయప్ప విహరించిన వైనాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో తేలియాడారు.