కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వరుని ఆలయంలోనూ అంటరాని తనం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ.. నమ్మితీరాల్సిందే. ఈ ఆలయంలో హరిజన, గిరిజన తెగల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చే వరకు ప్రవేశం కల్పించలేదు. కనీసం.. అలిపిరి దాటి తిరుమల సప్తగిరులు ఎక్కేందుకు సైతం వారు అనర్హులు. ఫలితంగా బ్రిటీష్ హయాంలో దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరించారు.
దీంతో వెంకన్నపై భక్తిభావం కలిగిన దళిత భక్తులు ప్రత్యామ్నాయంగా అలిపిరి సమీపంలోని అటవీప్రాంతంలో ఉన్న జలపాతం వద్ద తలవెంట్రుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకునేవారు. అందుకే ఈ జలపాతానికి మాలాడగుండం అని పేరువచ్చినట్టు పురాణాలు చెపుతున్నాయి.
అయితే, స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1944 సంవత్సరంలో మహాత్మా గాంధీ హరిజనోద్ధరణ ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో జాతిపిత తిరుపతికి వచ్చినపుడు ఈ విషయాన్ని పలువురు దళితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరజాతి బ్రిటిష్ అధికారులను కొండ ఎక్కనిచ్చి స్వజాతీయులైన దళితులను ఎందుకు ఎక్కనీయడం లేదని గాంధీ ప్రశ్నించారు.
నాటి నుంచి దళిత పోరాటాలు ఆరంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత తిరుపతి నుంచి తిరుమలకు దళితులకు ప్రవేశం కలిగింది. ప్రస్తుతం తితిదేలో వందలాది మంది దళిత ఉద్యోగులు తమ సేవలను అందిస్తూ భక్తుల సేవలో తరిస్తున్నారు.