నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

FILE
తిరుమల తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలకు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు అంకురార్పణ జరుగుతుంది. ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే. ఈ అంకురార్పణ సందర్భంగా నవధాన్యాలను మొలకెత్తిస్తారు.

ఆ తర్వాత గురువారం ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు తొమ్మిది రోజుల పాటు పగలు, రాత్రి వివిధ వాహనాల్లో కన్నువ పండువగా తిరుమల మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దేవదేవుడు దర్శనమిస్తారు. ధ్వజారోహణకు ముందురోజు సాయంత్రం శ్రీవారి సేనాధిపతి ఆధ్వర్యంలో మండపంలో అంకురార్పణ జరుగుతుంది. శ్రీవారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంతమండపం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చే పుట్టమన్నులో అంకురార్పణ చేస్తారు.

ఈ బ్రహ్మోత్సవాలపై తితిదే ఛైర్మన్, ఎలూరు ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ.. ఈనెల 29వ తేదీ నుంచి ఆరంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.

అలాగే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు తిలకించడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

ఉత్సవాల సమయంలో వీఐపీలూ సామాన్య భక్తులేనన్నారు. ఉత్సవాల సమయంలో ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. వాస్తవానికి తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడూ వీఐపీనేనన్నారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. తిరుమల- తిరుపతి మధ్య నిమిషానికో బస్సును నడుపనున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి