బ్రహ్మోత్సవాలు: శోభాయమానంగా పుష్పప్రదర్శన

శనివారం, 1 అక్టోబరు 2011 (19:14 IST)
WD

ఒక చెట్టుకు ఓ పువ్వు పూస్తే, అదే పువ్వును పదేపదే చూస్తూ మురిసిపోతాం. ఆ అందాన్ని ఆస్వాదిస్తాం. ఇలాంటి పుష్పాలు ఒకటి కాదు రెండు కాదు వేలాదిగా ఒకే చోట దర్శనమిస్తే.... కనురెప్ప వాలనంటుంది, కాలు కదలనంటుంది. నిజంగా అలాంటి దృశ్యమాలిక లభిస్తే ఆహా... ఆ అందం చూడతరమా...! నిజమండీ బాబూ ఇలాంటి దృశ్యం మీకు తిరుమలలో కనువిందు చేస్తుంది. బ్రహ్మోత్సవాలలో ఆ పుష్ప పరిమళాల మైమరపింప జేస్తాయి. ఇంకెందుకాలస్యం తిరుమల బాట పడదాం రండీ.


WD

నయనానందకరం అనే పదానికి నిజంగా అక్కడే అర్థం లభిస్తుంది. కేవలం పుష్పప్రదర్శనను తిలకించడానికే జనం క్యూ కడతారు. ప్రపంచంలోనే అత్యంత అలంకారభూషితంగా కనిపించే దేవుళ్ళలో వెంకన్నను మించిన దేవుడు మరొకరు ఉండరు. అలంకరణ అంటే ఆయనకు అంతటి ప్రీతి మరి.


WD

అలంకార ప్రియుడికి వినియోగించే అన్ని రకాలు ఫలపుష్పాలను చూసే భాగ్యం మనకు కలిగితే... ఆ అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోలేం. టిటిడి ప్రతీ ఏటా బ్రహ్మోత్సవాలలో ఆ భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తుంది. భక్తిభావం, ఆధ్యాత్మికతలకు ఆధునికతను మేళవించి ఈ ప్రదర్శనను ఇచ్చే టిటిడి ఉద్యానవనశాఖకు నిజంగా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.


WD

పుష్పప్రదర్శన అంటే నాలుగు గులాబీలు, నాలుగు రోజాలు అలంకరించి ఉదయం నుంచి సాయంత్రానికి ముగింపు పలుకడం సహజం. అంతకుమించి వాటిలో తాజాదనాన్ని నింపడం ఎవరికైనా వల్లమాలిన పనే. కాని టీటీడీ కనీసం 10 రోజులపాటు కనువిందు చేసే రకరకాల పుష్పఫల ప్రదర్శనలను భక్తులకు అందిస్తుంది.


WD

వందకు పైగా రకరకాల పుప్పాలు, మొక్కలను ప్రదర్శనలో వినియోగిస్తారు. వీటిని తాజాగా ఉంచడానికి టీటీడీ ఉద్యానవన శాఖ ఎంతో శ్రమ తీసుకుంటుంది. ఈ పర్యాయం పాప వినాశనం దారిలో కొత్తగా నిర్మిస్తున్న కళ్యాణమండప స్థలంలోని ప్రదర్శన శ్రీవారి భక్తలను రా.. రమ్మని పిలస్తోంది. గత ఏడాది కంటే భిన్నమైన రీతిలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.


WD

సాధారణంగా స్వామి వారి అలంకరణకు ప్రతిరోజూ 1500 కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఇందులో సంపెంగలు మొదలకుని, సాంప్రదాయ పూలు, ఆధునిక రోజా జాతి పుష్పాల వరకూ అన్నింటికి స్థానం లభిస్తుంది. శ్రీవారి అలంకరణ చూడడానికి రెండు కళ్ళు చాలవు. అలంకరణలో టిటిడి అర్చకులు తీసుకునే మెళుకువలు నేటికీ రహస్యమే. మరెక్కడా ఇలాంటి అలంకరణ లభించదు. అలాంటి పుష్పాలను సమీపం నుంచి చూసి తరించే భాగ్యం పుష్ప ఫల ప్రదర్శన ద్వారానే లభిస్తుంది. టిటిడి ఈ పుష్పాలను దేశవిదేశాల నుంచి తెప్పిస్తుంది.


WD

పుష్పాలను ఎవరైనా తెప్పించుకోగలరు. కాని వాటిని ఏర్చి కూర్చడమే కళ. ఏదో ఫ్యాషన్‌ షోలా ఏర్పాటు చేయడానికి ఏమాత్రం కుదరదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పుష్పప్రదర్శన ఉండాలి. అంతేకాదు కనువిందు చేయాలి. అందులోనే అర్థం ఉండాలి. ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉద్యానవన శాఖ ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంది.


WD

పుష్పాలు, పత్రాలు, ఫలాలతోనే స్వామివారి దశావతారాలను ఏర్పాటు చేశారు. ఈ తీరు నయనానందకరం. అంతేనా ఏడుకొండలవాడి ఆలయంలోని ద్వార తీరును చక్కగా కనులకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. శ్రీమహావిష్ణువు పడక దృశ్యాన్ని పండించారు. ఎంతో కళాత్మకత, ఆధ్యాత్మికత, ఆధునికత కనిపించే ఈ ప్రదర్శన ఎంత చెప్పినా తక్కువే. వాటిని తిలకించాలంటే తిరుమలకు రావాల్సిందే.

వెబ్దునియా పై చదవండి