శ్రీవారి తిరునామానికి ఎంతో విశిష్టత ఉన్న విషయం తెల్సిందే. ఈ తిరునామం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అనే రెండు తెగలున్నాయి. వడగలై వారు ఆంగ్ల అక్షరం యు ఆకారంలో ఊర్ధ్వపుండ్రాలు నామం దిద్దుకుంటారు. తెంగలైవారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం ధరిస్తారు. ఈ రెండు నామాల ఆధారంగానే వైష్ణవ తెగలకు చెందిన ప్రజలను ఇట్టే గుర్తిస్తారు. అయితే, శ్రీవారి నుదుటన దిద్దే నామం 'యు', 'వై' ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం 'ప' ను పోలివుంటుంది. దీన్నే 'తిరుమణికావు' నామంగా పిలుస్తారు.
సంప్రదాయబద్ధంగా మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తర్వాత వారానికి ఒకసారి మాత్రమే చందనపు పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు (ఆభరణాలు తీసివేయడం) సమయంలో స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతమేర తగ్గిస్తారు. నామధారణకు 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరి వాడతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే శుక్రవారాల్లో 32 తులాల పచ్చకర్పూరం, మూడు తులాల కస్తూరి వాడతారు.