అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత : ఊహించని షాకిచ్చిన హైకోర్టు

గురువారం, 14 జూన్ 2018 (16:06 IST)
తమిళనాడు రాష్ట్రంలో తిరుగుబాటు నేత టీటీపీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై వేసిన అనర్హతవేటు కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేసమయంలో తమిళనాడు సర్కారుకు తాత్కాలిక ఉపశమనం దొరికింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టులో ఇద్దరు జడ్జిలు చెరో రకమైన తీర్పును వెలువరించారు. దీంతో మూడో జడ్జి తుది తీర్పును వెలువరించనున్నారు.
 
అయితే దినకరన్‌కు మద్దతుగా ఉన్న 18 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలపై 2017 సెప్టెంబర్‌లో స్పీకర్ ధనపాల్ అనర్హత వేటువేశారు. దీనిపై దినకరన్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసును విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ వేర్వేరుగా తమ తీర్పును ఇవ్వడంతో కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయడం జరిగింది. 
 
నిజానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామికి ఎక్కువమంది సభ్యుల మద్దతు లేదు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 117. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు 114మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరో 18మంది ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా.. పళని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. 
 
వీరి అనర్హత వేటును ఉపసంహరిస్తే.. తిరిగి వీరు పళని ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్‌ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే అవకాశముంది. పళనిని సీఎం పదవి నుంచి దింపేసి.. దళిత ముఖ్యమంత్రిని పీఠం ఎక్కించాలని దినకరన్‌ ప్రస్తుతం డిమాండ్‌ చేస్తున్నారు. కానీ తాజా తీర్పుతో ఆయన ఆశలు నెరవేరకుండా పోయాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు