ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ చేసింది.. రూ.40 వేలు పోగొట్టుకుంది.. ఎలా?

శుక్రవారం, 5 జులై 2019 (16:16 IST)
ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ కోసం ఆర్డర్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఒక్కోసారి ఫుడ్ డెలివరీ సంస్థలు ఆర్డర్ చేసిన వారికి చుక్కలు చూపుతున్నాయి. అలాంటి ఘటనే నిన్న చెన్నైలో జరిగింది.
 
బిర్యానీ కోసం ఆర్డర్ చేసిన యువతికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ బిర్యానీ అందించకపోగా రూ.40 వేలు పోవడానికి కారణమైంది. ఉబర్ ఈట్స్ సంస్థ వారు చేసిన ఈ నిర్వాకంపై సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చెన్నై సౌకార్‌పేటకు చెందిన ప్రియా అగర్వాల్‌ (21) బుధవారం నాడు ఉబర్‌ ఈట్స్‌ కంపెనీకి ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసింది. బిర్యానీ ధర రూ.76 ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించింది.
 
అయితే తాను చేసిన ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో ఆమె ఉబెర్ ఈట్స్ కాల్ సెంటర్ నంబర్‌కి ఫోన్ చేసి సంప్రదించగా, ఆమె చెల్లించిన రూ.76 తిరిగి పొందాలంటే ముందుగా రూ.5 వేలు చెల్లించాలని, తాము మొత్తం రూ.5,076 ఆమె ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వారు చెప్పిన ప్రకారమే ఆమె రూ.5 వేలు చెల్లించినా డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మరలా కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేయగా మరోసారి రూ.5 వేలు చెల్లించండని చెప్పారు. 
 
ఇలా 8 సార్లు రూ.5 వేల లెక్కన మొత్తం రూ.40 వేలు చెల్లించింది. ఫలితంగా ఆమె రూ.76తో పాటూ రూ.40 వేలను కూడా కోల్పోయింది. చివరకు తాను మోసపోయినట్లు గ్రహించిన ప్రియా అగర్వాల్ చెన్నై వడపళని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైం పోలీసులు జరిగిన సంఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు