ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడతామని, రేపు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెబుతామని అన్నారు. బలపరీక్షలో నెగ్గుతామని తమకు 100 శాతం నమ్మకం ఉందని చెప్పారు. కర్ణాటకలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఐదేళ్ల పాటు పాలిస్తామని అన్నారు.
నిజానికి రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యడ్యూరప్పకు ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా 15 రోజుల సమయం ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. రేపు సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని స్పష్టమైన ఆదేశాలను వెలువరించింది.
కాగా, సుప్రీంకోర్టు సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలబెట్టుకుందని చెప్పారు.
అనైతిక విధానాలతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టులాంటిదని అన్నారు. రేపు జరగబోయే బలపరీక్షలో యడ్యూరప్పకు, బీజేపీకి పరాభవం తప్పదని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలపరీక్షలో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.