తమిళ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ మరోమారు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అనేక రకాలైన వదంతులు పుట్టుకొచ్చాయి. ఫలితంగా ఆయన ఆరోగ్యంపై విజయకాంత్ కుమారుడు ఓ క్లారిటీ ఇచ్చారు. డాడీ ఆరోగ్యం బాగుందని, వదంతులు నమ్మొద్దంటూ డీఎండీకే శ్రేణులతో పాటు.. కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారు.
కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ఆ మధ్య అమెరికా వెళ్లి అక్కడి ప్రైవేటు ఆస్పత్రిలో నెల రోజులపాటు చికిత్సలు పొంది, ఆగస్టు మొదటి వారంలో చెన్నై తిరిగొచ్చిన విషయం తెల్సిందే. నగరానికి చేరుకున్న వెంటనే ఆయన మెరీనా బీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో విజయకాంత్ నడవలేని పరిస్థితిలో కనిపించారు. సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ కలిసి ఆయన చేతుల్ని గట్టిగా పట్టుకుని నడిపించుకుంటూ వెళ్లారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విజయకాంత్ ఉన్నట్టుండి మియాట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అదేసమయంలో విజయకాంత్ ఆరోగ్యంపై వాట్సప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక ప్రసారమాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. విజయకాంత్ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని, లేవలేని పరిస్థితిలో పడుకునే ఉన్నారంటూ వార్తలు కూడా వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ ఆ వదంతులను ఖండిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. విజయకాంత్ సాధారణ చికిత్సల కోసం మియాట్ ఆస్పత్రిలో చేరారని, ఆయన కులాసాగానే ఉన్నారని స్పష్టం చేశారు. విజయకాంత్ త్వరలోనే కోలుకుని జనం మధ్యకు వస్తారని, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకూడదని ఆయన సూచించారు.