రాజీనామా చేసి గెలిచే సత్తా నాకుంది, ఆయనకుందా? పవన్ కళ్యాణ్ 'గాలి' తీసేస్తున్న రాపాక

శుక్రవారం, 13 డిశెంబరు 2019 (17:33 IST)
రాజకీయాలు అంటేనే అంతే. అధికారం వున్నవారి వైపే అంతా వుంటుంది. ఓటమి పాలయితే పట్టించుకునేవారుండరు. ఐతే ఓడినా కనీసం ఆ పార్టీ నుంచి గెలిచినవారు పార్టీకి కాస్తాకూస్తో వెన్నుదన్నుగా వుంటుంటారు. కానీ జనసేనకు ఆ పరిస్థితి కనబడటంలేదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్ పార్టీ అధినేత గాలి తీసేసే వ్యాఖ్యలు చేసి తీవ్ర చర్చకు తెరలేపారు. గెలవలేని వారు కూడా నాపై పెత్తనం చెలాయించాలనుకోవడం ఆశ్చర్యంగా వుందంటూ వ్యాఖ్యానించారు. 
 
అసలు విషయానికి వస్తే... కాకినాడలో పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. దీనితో ఆయనకు జనసేన పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇది ఫేక్ న్యూస్ అని తెలిసేలోపుగానే ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
తనకు ఎవరో షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి? తను గెలిచిన ఎమ్మెల్యేననీ, ఓడిపోయినవాళ్లు తనకు షోకాజ్ ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు. పార్టీ మీద కాస్తో కూస్తో అధికారం ఎవరికైనా వున్నదని అనుకుంటే అది తనకు మాత్రమే వున్నదంటూ వ్యాఖ్యానించారు. అసలు తను జనసేన పార్టీ వల్ల గెలవలేదనీ, స్వశక్తితో గెలిచానన్నారు. 
 
అంతటితో ఆగితే ఫర్వాలేదు... ఇప్పటికిప్పుడు తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిచే సత్తా తనకు వుందన్నారు. మరి రెండు చోట్లు ఓడిపోయిన ఆయనకు ఆ సత్తా వుందా అంటూ ప్రశ్నించారు. రాపాక వ్యాఖ్యలతో ఇక ఏ క్షణమైనా జనసేనను వదిలేసి వైసీపి గూటికి చేరే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు