తెలంగాణలో పార్టీ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల.. ఇప్పటికే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలు కూడా ఎత్తి చూపడం మొదలు పెట్టారు.
ఇక, ఇవాళ ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన షర్మిల.. తాను పోటీ చేసే స్థానం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. నేను పాలేరు నుంచి బరిలోకి దిగుతానన్న ఆమె వైఎస్సార్‌కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలాగే. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని ఖమ్మం నేతలతో చెప్పినట్లు సమాచారం.
ఇక గతంలో ఆమె తన కొత్త పార్టీ ప్రకటన పై క్లారిటీ ఇచ్చారు.. ఏప్రిల్ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని... లక్ష మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఇక తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని వ్యాఖ్యానించిన ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటన, పోటీ స్థానం మీద కూడా క్లారిటీ రావడంతో.. జెండా, ఎజెండా.. ఇతర అంశాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.