సీఎం కుమార స్వామిని వెంటాడుతున్న సెంటిమెంట్.. ఏంటది?

గురువారం, 24 మే 2018 (08:39 IST)
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమార స్వామి గౌడ బుధవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని హేమాహేమీలందరూ హాజరయ్యారు. ఇంతవరకు బాగానేవుంది.. ఇప్పుడు మరో ప్రశ్న రాజకీయ పండితులను కుదురుగా ఉండనివ్వడం లేదు. సీఎం అయిన కుమారస్వామి ఐదేళ్లూ ఆ పదవిలో ఉంటారా? లేదా అనేదే ఆ ప్రశ్న. ఎందుకంటే.. ఆయన్ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది.
 
ఆ సెంటిమెంట్ ఏంటో కాదు.. కర్ణాటక విధాన సౌథ ముందు ప్రమాణ స్వీకారం చేసిన ఏ ఒక్క ముఖ్యమంత్రీ పూర్తికాలం కుర్చీలో కొనసాగలేదు. ఈ విషయాన్ని చరిత్ర చెబుతోంది. గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో సాదాసీదాగా ప్రమాణ స్వీకారం నిర్వహించేవారు. కానీ, 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారి విధాన సౌథ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో యేడాదిలోపే పదవిని కోల్పోయారు. అదే యేడాది మరోమారు ముఖ్యమంత్రి అయినా ఈసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పదవి చేజార్చుకున్నారు.
 
అంతకంటే ముందు 1990లో బంగారప్ప కూడా ఇలాగే విధాన సౌథ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. కావేరీ నదీ జలాల విషయంలో అల్లర్లు చెలరేగడంతో రెండేళ్లలోనే పదవి నుంచి తప్పుకున్నారు. 2006లో కుమారస్వామి కూడా ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి 20 నెలలకే పదవిని కోల్పోయారు. 2008లో యడ్యూరప్పకూ ఇదే అనుభవం ఎదురైంది. అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కుమారస్వామి విధాన సౌథ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మరి గత చరిత్రను ఆయన మారుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు