కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ మహేష్ చికిత్స నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నెఫ్ట్ ద్వారా 17 లక్షల రూపాయలను చెన్నయ్ అపోలో ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేశారు.
నెల్లూరు శివారులోని చంద్రశేఖర్ పురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఫిలిం క్రిటిక్, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ తన స్వగ్రామం చిత్తూరు నుంచి హైదరాబాదుకు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కత్తి మహేష్ ఇన్నోవా కారు, ఒక గూడ్స్ లారీని వెనక నుంచి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కత్తిని తొలుత నెల్లూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో చెన్నయ్ అపోలో ఆసుపత్రికి తరలించారు.
అక్కడ గత మూడు రోజులుగా చికిత్స పొందున్న కత్త మహేష్ ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. ఆయన చూపు దెబ్బతిందని, ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు కత్తికి ప్రాణ హాని ఏమీలేదని, ఆయన కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.