#KGF హీరోకి వార్నింగ్.. మాలాంటి వారు లేకపోతే మీ జీవితాలు..?

బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:08 IST)
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు చిత్రాలు నిర్మించకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకు సాగవని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు తాను ఒప్పుకుంటానన్న నమ్మకం తనకు లేదని కుమారస్వామి అన్నారు. 
 
మాండ్యాలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో దివంగత నటుడు అంబరీశ్ సతీమణి నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆమెకు ప్రత్యర్థిగా ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సుమలతకు మద్దతుగా యశ్ రంగంలోకి దిగి ఆమె తరపున ప్రచారం చేశాడు. 
 
ఈ సందర్భంలో జేడీఎస్‌పై విమర్శలు కురిపించడంతో ఆ పార్టీ నేత, సీఎం కుమారస్వామి మండిపడ్డారు. "మాలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి జీవితాలు ముందుకు సాగవు, అలాంటి నటులు తన పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు. తాను పార్టీ కార్యకర్తలను కట్టడి చేయడం వల్లే వారు అతడిపై ఏ కామెంట్ చేయకుండా మౌనంగా ఉన్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
 
కుమారస్వామి మాటలు బట్టి చూస్తుంటే యశ్‌కు నిర్మాతలెవరూ అవకాశాలివ్వొద్దని పరోక్షంగా హెచ్చరిస్తునట్లేనని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన యశ్, కన్నడ చలనచిత్రాల్లో టాప్ హీరోగా ఎదగడం..తన కుమారుడు నిఖిల్ హీరోగా విఫలం కావడం లాంటి విషయాలను మనసులో పెట్టుకునే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారని శాండిల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు