తూర్పు గోదావరి జిల్లా..ప్రత్తిపాడులో కింగ్ కోబ్రా పాము సంచరిస్తోంది. ప్రత్తిపాడు మండలం చింతలూరు సరుగుడు తోట్లలో కింగ్ కోబ్రా సంచరించడంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. పన్నెండు అడుగుల పొడవున్న ఈ కోబ్రా సరుగుడు తోటలలో కన్పించింది. అది మనుషులను చూస్తూ, ఆగి ఆగి వెళ్తుంటే భయం వేస్తోందని రైతులు అంటున్నారు.
చింతలూరు గ్రామానికి చెందిన బొడ్డు లోవరాజు, సూరిబాబుల పొలాల్లో ఇది అధికంగా సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు దీన్ని పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలి అని రైతులు కోరుతున్నారు. లేకుంటే, అది తమని కాటేస్తే... అక్కడిక్కడే ప్రాణాలు పోతాయని ఆందోళన చెందున్నారు. ఈ పాము వీడియోని తీసి, అధికారులకు చూపించారు ప్రత్తిపాడు రైతులు.