రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన పోసాని

మంగళవారం, 9 జూన్ 2020 (23:31 IST)
గత ఆదివారం జరిగిన నా ప్రెస్‌ మీట్‌లో గౌరవనీయులు యం.పి గారు అయిన రేవంత్‌ రెడ్డి గారిని వ్వక్తిగతంగా, రాజకీయంగా విమర్శించానని, అలాగే ఘాటు వ్యాఖ్యలు చేసానని వార్తలు వచ్చాయి. అలాగే రేవంత్‌ రెడ్డిపై పోసాని ఫైర్‌, రేవంత రెడ్డిపై పోసాని ఘాటు కామెంట్స్‌ అని సోషల్‌ మీడియాలోనూ, యూ ట్యూబ్‌ చానల్స్‌లోనూ విపరీతంగా ట్రోల్‌ అవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి నేను ఎంతో బాధపడ్డాను అని ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.
 
ఈ విషయం మీద యంపి రేవంత్‌ రెడ్డి గారు, ఆయన సన్నిహితులు, ఆయన అభిమానులు మనస్తాపం చెందారని తెలిసింది. నాకు తెలసి గానీ, తెలియక గానీ నా లైఫ్‌‌లో యంపి రేవంత్‌ రెడ్డిగారిని వ్వక్తిగతంగా గానీ, రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు. 
 
మొన్న జరిగిన ప్రెస్‌ మీట్‌లో కూడా నేను తప్పుగా మాట్లడ లేదు. ఎప్పుడైనా ప్రెస్‌మీట్‌లో ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు విమర్శతో పాటు సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుంది.. అలా ఉంటే అది  జనం కూడా నమ్ముతారు. జనం గుండెల్లోకి కూడా మీ వార్త చేరుతుంది.. అలా అయితే ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడానే తప్ప.. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు.. మరీ ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి గురించి నేను అసలు మాడ్లడలేదు.
 
ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఛానల్స్‌లో బాగా ట్రోల్‌ అవుతున్నాయి  కాబట్టి, ఇది నా బాధ్యతగా తీసుకొని రేవంత్‌ రెడ్డికి, ఆయన అభిమానులకు జరిగిన దానిపై విచారం వ్యక్తం చేస్తున్నాను.. ఇది నా తప్పుగానే భావించి, ఈ తప్పును రెక్టిఫై చేసుకుంటాను అని పోసాని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు