రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సమావేశానికి కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. వచ్చే నెల 7వ తేదీన నాగ్‌పూర్ వేదికగా జరుగనున్న సంఘ్ శిక్షావర్గ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.
దీనిపై ఆప్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ, తమ కార్యక్రమానికి వచ్చేందుకు ప్రణబ్ అంగీకరించడం ఆయన గొప్పతనాన్ని సూచిస్తుందన్నారు. నాగపూర్‌లోని రేష్మీబాగ్‌లో ఉన్న కేంద్ర కార్యాలయంలో జరిగే వార్షిక కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అన్నారు.
రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నంత మాత్రాన శత్రువులు కారని ప్రణబ్ తన అంగీకారం ద్వారా దేశానికి సంకేతాలు పంపారని సంఘ్ నేత రాకేశ్ సిన్హా అన్నారు. కాగా, ప్రణబ్‌కు మొదటి నుంచీ సంఘ్ పరివార్‌తో సత్సంబంధాలున్నాయని, 2012లో రాష్ట్రపతి కాగానే ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్‌ను రాష్ట్రపతి భవన్‌కు మధ్యాహ్న విందుకు ఆహ్వానించారని సంఘ్ వర్గాలు గుర్తుచేశాయి.