ఐసీఎంఆర్ అందుకే రాలేదు, ఆనందయ్య మందుపై తిరుపతిలో పరిశోధనలు ప్రారంభం

సోమవారం, 24 మే 2021 (22:44 IST)
ఆయుర్వేదం, పసరు వైద్యం, నాటు వైద్యం.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూడింటిపైనే చర్చ జరుగుతోంది. ఎప్పుడో పాతకాలం నాటి వైద్యంపై ఇప్పుడెందుకు చర్చ జరుగుతుందని అనుకోవచ్చు. కానీ అందుకు కారణమే నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం ప్రాంతానికి చెందిన ఆనందయ్యే. ఆనందయ్య తయారుచేసే ఔషధంపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
 
అసలు ఆనందయ్య తయారుచేసే ఔషధం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. కళ్ళలో వేస్తే కళ్ళు పోతాయా.. వేరే అవయవాలకు ఇబ్బంది కలుగుతుందా ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతోంది. మొదట్లో రాష్ట్రప్రభుత్వం ఈ ఔషధ పంపిణీపై అనుమతినిచ్చింది. 
 
కానీ లోకాయుక్తలోకి ఈ వ్యవహారం కాస్త వెళ్ళడంతో రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. దాంతో పాటు ఒక్కరోజులోనే జనం ఇష్టానుసారం వచ్చేయడంతో లాఠీఛార్జ్ చేసి చివరకు తాత్కాలికంగా మందు పంపిణీని ఆపేసింది. అయితే ఈరోజు ఆనందయ్య మందుపై ఐసిఎంఆర్ పరిశోధనలకు వెళ్ళాల్సి ఉంది. 
 
కానీ ఐసిఎంఆర్ పరిధిలోకి ఆయుర్వేదం రాకపోవడంతో జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థకు ప్రభుత్వం దీన్ని అప్పగించింది. దీంతో తిరుపతిలో దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఆనందయ్య దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న 500 మంది వివరాలను సేకరించారు.
 
వారితో నేరుగా మాట్లాడుతున్నారు తిరుపతి ఆయుర్వేద కళాశాల వైద్యులు. ఆ తరువాత క్రిష్ణపట్నం నుంచి తీసుకువచ్చిన ఔషధాన్ని పరిశోధనలు చేయనున్నారు. రేపు సాయంత్రంతో కరోనా పేషెంట్ల వివరాలను సేకరించనున్న ఆయుర్వేద వైద్యులు ఆరువాత నాలుగు లేకుంటే ఆరు వారాల్లోగా ఔషధంపై పరిశోధనలు చేసి నివేదికను జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్ధకు అందించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు