ఏకగ్రీవాల్లో అధికార పార్టీ వైసిపి అభ్యర్థుల హవా, నివేదిక కోరిన ఎస్ఈసి

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (19:46 IST)
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. ఈమేరకు రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నివేదిక కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితికి ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలకు పొంతన లేదని ఎస్‌ఈసీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించారు. ఏకగ్రీవాలపై చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు వివరణాత్మక నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదికలు పరిశీలించిన తర్వాతే కమిషన్‌ తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 
 
గుంటూరు జిల్లాలో 67 స్థానాలు ఏకగ్రీవం..
గుంటూరు జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరుగుతున్న తెనాలి డివిజన్‌లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్న మధ్యాహ్నంతో ముగిసింది. 337 సర్పంచి స్థానాలకు గాను 67 సర్పంచి స్థానాలకు ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయి. 63 చోట్ల అధికార పార్టీ సానుభూతిపరులు ఏకగ్రీవం కాగా, పీవీపాలెం మండలంలో ఒకటి, కొల్లిపర మండలంలో ఒకటి చొప్పున తెదేపా సానుభూతిపరులకు ఏకగ్రీవమయ్యాయి. ఏ పార్టీ మద్దతు లేకుండా ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం మీద 20 శాతం మేర ఏకగ్రీవాలు జరిగాయి.
 
అభ్యర్థులు నామినేషన్ల పోటాపోటీగా వేసినప్పటికీ ఉపసంహరణకు చివరిరోజు కొందరు వెనక్కి తీసుకోవడంతో ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. అధికార పార్టీ నేతలు గ్రామస్థాయిలో మంత్రాంగం జరిపి ఎక్కువ పంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్పంచి, ఉపసర్పంచి పదవుల కాలాన్ని పంచడం ద్వారా కొందరిని పోటీ నుంచి తప్పుకునేలా చేశారన్నది మరో ఆరోపణ.
 
తెదేపా సానుభూతిపరులు పోటీలో ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తారన్న పరిస్థితి ఉన్నచోట ఆయా అభ్యర్థులను తమవైపు తిప్పుకుని సొంత పార్టీ తరఫున అభ్యర్థులు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆయా అభ్యర్థులకు పార్టీ కండువా కప్పి ఏకగ్రీవం చేసుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమైనా వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసిన ఒకరిద్దరు ఉపసంహరించుకోకపోవడంతో ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 
 
చిత్తూరు జిల్లాలో..
చిత్తూరు డివిజన్‌లో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యే నాటికి 112 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అధికార వైకాపా మద్దతుదారులు 95 మంది, తెదేపా మద్దతుదారులు తొమ్మిది మంది, స్వతంత్రులు ఎనిమిది మంది ఉన్నారు. తొలి దఫాలో 468 పంచాయతీలకుగాను 453 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 341 స్థానాలకు ఈనెల 9న పోలింగ్‌ జరగనుంది.
 
పూతలపట్టు నియోజకవర్గంలో 152 సర్పంచులకు ఏకంగా 49 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వైకాపా 40, తెదేపా ఏడు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 137 సర్పంచి స్థానాలకుగాను 26 చోట్ల పోటీ లేకుండా పోయింది. 2499 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు