వ్యాక్సిన్ మీరు మీ బాహువులకు వేయించుకోండి... అలా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారంతా బాహుబలులే అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. వాటి ప్రారంభానికి ముందు వర్షంలో గొడుగు పట్టుకుని మరీ మీడియాతో మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.
బాహువులకు తీసుకునే వ్యాక్సిన్ మనల్ని బాహుబలుడిని చేస్తుందని, 40 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే బాహుబలులుగా మారారని ప్రధాని చెప్పారు. వారంతా ఇపుడు కోవిడ్ తో యుద్ధం చేసి, విజయం సాధించారని ప్రధాని వ్యాఖ్యనించారు. దేశంలో అత్యంత వేగంగా సాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ పై పార్లమెంటులో సుదీర్ఘంగా చర్చించనున్నామని ప్రధాని తెలిపారు.
కోవిడ్ అనంతరం పెండమిక్ పరిస్థితుల్లో ప్రపంచం అంతా వైరస్ గుప్పిట్లో బంధీ అయిన అల్లాడుతోందని ప్రధాని పేర్కొన్నారు. దీనిని జయించడానికి కోవిడ్ వ్యాక్సిన్ ఒకటే మందు అని వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని, కోవిడ్ మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో అందరూ విజయం సాధించాలని మోదీ ఆకాంక్షించారు.
భారతదేశం వంటి పెద్ద దేశంలో వ్యాక్సిన్ 40 కోట్ల భారతీయులకు చేరడం ఒక మహోద్యమని ప్రధాని వర్ణించారు. దీనిని పూర్తిగా దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని అన్ని రాష్ట్రాల సహకారం కూడా బాగుందని వివరించారు.