నాకో గాళ్‌ఫ్రెండ్ కావలెను.. అంటే సరిపోదు...

సోమవారం, 7 ఫిబ్రవరి 2011 (18:07 IST)
WD
టీనేజ్‌ ఫ్రెండ్‌షిప్‌ల ముందు ఏ "షిప్పూ" పనికిరాదు. అదో రంగుల లోకం. ఆ లోకంలో తాము మాత్రమే విహరించాలంటూ కలలు కంటుంటారు. స్నేహం రకరకాలుగా ఉంటుందనుకోండి. ఈ రకాల్లో మొదటి రకం ప్రేమతో కూడిన స్నేహబంధం. ఈ ప్రేమ బంధం మొగ్గతొడిగితే చాలు... ఇక లోకంలో ఎవ్వరూ కనపడరు.. ఒక్క ప్రేయసీ/ప్రియుడు తప్ప.

అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు పెద్దలు. కానీ నేటి ఆధునిక లవర్స్ మాత్రం ప్రేమ విశాలమైన నేత్రాలు కలిగిన ఓ బ్యూటిఫుల్ పవర్ అంటున్నారు. ప్రేమ లేనిదే ఏదీ లేదని చెపుతున్నారు. అంతేకాదు ప్రేయసి వద్ద సంపూర్ణమైన ప్రేమను పొందేందుకు కొన్ని చిట్కాలను కూడా చెపుతున్నారు సూపర్ సక్సెస్ లవర్స్. అవేంటో చూద్దాం....

టైమ్ ముఖ్యం గురూ...
చెప్పిన చోటకు, చెప్పిన సమయానికి, చెప్పినట్లు రాకపోతే అమ్మాయి అప్సెట్. అందుకే బాసూ ఫలానా చోటికి ఫలానా టైంకి వస్తానని చెపితే గంటకొట్టి మరీ అక్కడ ఐదు నిమిషాలకు ముందే ఉండాలి. లేదంటే అమ్మాయి కారాలు మిరియాలు నూరుతుంది. ఆ తర్వాత మీ పని మిర్చిమసాలే.

పిలిస్తే ఊరకనే అలా వెళ్లి ఉబుసుపోని కబుర్లు చెపితే అమ్మాయికి కోపం రావచ్చు. అందుకని ఆమెకే ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. అలాగని మూగమొద్దులా కూచోకూడదు. మధ్యమధ్యలో ప్రేయసి మనసు మీటే మాటల బాణాలను తూటాల్లా వదలాలి. ఆ మాటలు ఎలా ఉండాలంటే ఇక ఈ జన్మలో మీతోటిదే లోకం అన్నట్లు ఉండాలి మరి.

ప్చ్.. అబద్ధం చెప్పారా... అందుకే...
కొంతమంది ప్రేయసి వద్ద కొన్ని(చెప్పాల్సినవి) దాచేసి అబద్ధాలు చెపుతుంటారు. అది రివర్సై చివరికి మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఒకరిపై ఒకరు రుసరుసలాడుకోవడమూ జరుగుతుంది. కనుక ప్రేయసి వద్ద, ముఖ్యంగా ఆమెకు సంబంధించినది కావచ్చు లేదా ప్రియునికి సంబంధించినది కావచ్చు నిజాన్ని చెప్పేయడమే బెటర్. అబద్ధం చెపితే అరచెంప వాచిపోవచ్చు. బీ కేర్‌ఫుల్

ఆ అమ్మాయిని ప్రేమించడానికి మీవద్ద ఏముంది..?
మీ అందం, కండలు తిరిగిన శరీరం.. ఇలాంటివి చూసి అమ్మాయి ప్రేమలో పడిందని అనుకోవడం పొరపాటు. నేటితరం అమ్మాయిలు అబ్బాయిల బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుని మరీ ప్రేమిస్తున్నారు. అలాగని వారి ప్రేమ స్వార్థంతో కూడుకున్నది అనుకునేరు. అది ప్రియుడికోసమే. అతడితో సంతోషంగా కాలం గడిపేందుకే.

వాళ్లు ఆశించేందేమంటే... ప్రేమతో దగ్గరైన తర్వాత తమకు భవిష్యత్తులో ఆర్థిక, సామాజిక... ఇతరత్రా అడ్డంకులు ఎదురు కాకూడదన్నదే. అలా చూసుకోవడం ద్వారా తమ ప్రేమను పండించుకుంటున్నారు. కనుక అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ నికరం చేసుకుని అమ్మాయిని సంప్రదిస్తే బెటర్.

లవ్ చేయడమే కాదు.. లవ్‌కేర్ కూడా ముఖ్యమే...
ప్రేమిస్తే సరిపోదు. ఆ ప్రేమను కంటికి రెప్పలా చూసుకోవాలి. ప్రేమలో పడిపోయింది కనుక ఇక తన వెంటే తిరుగుతుంది అనే వాదనకు బూజు పట్టి చాన్నాళ్లయింది. ప్రేమిస్తే... నచ్చని పనులు చేస్తే సహిస్తూ ఆ బంధంలో కొట్టుమిట్టాడాలా..? అనే ప్రశ్నలు వస్తున్నాయ్. నచ్చకపోతే... ఓ ఫైన్ మార్నింగ్ అమ్మాయి సిమ్ కార్డుతో సహా... ఇంటి డెస్టినేషన్ అడ్రెస్ కూడా మారిపోతుంది. అలా శాశ్వతంగా ప్రేమబంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. కనుక లవ్ కేర్ ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి గురూ.

వెబ్దునియా పై చదవండి