వాలెంటైన్స్ డే నాడు అమ్మానాన్నలతో గడపండంటున్న కలెక్టర్.. ఎవరు..?

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (14:51 IST)
ప్రేమికులకు షాక్ ఇస్తూ ఒక జిల్లా కలెక్టర్ వాలెంటైన్స్ డేకు సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీన మన యువతీయుకులు ఎవరూ ప్రేమికుల దినోత్సవంగా పేర్కొనే వాలెంటైన్స్ డేను జరుపుకోవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా కలెక్టర్ జి.కె.జైన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
 
పాశ్చాత్య సంస్కృతి నుంచి అరువు తెచ్చుకున్న ప్రేమికుల దినోత్సవాన్ని పక్కనబెట్టి.. ఫిబ్రవరి 14వ తేదీన యువత తమ తల్లిదండ్రులతో గడపాలని, వారిని ప్రేమపూర్వకంగా చూసుకోవాలని ఉద్భోదించారు. ఫిబ్రవరి 14వ తేదీన మాతృపితృ పూజా దినోత్సవంగా పాటించాలని కలెక్టర్ జైన్ కోరారు.
 
ప్రతి ఇంట్లోనూ, మరీ ముఖ్యంగా విద్యాసంస్థలు, సామాజిక సేవా సంస్థలు ఆ రోజున మాతృపితృ పూజా దినోత్సవంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతీయువకులు భిన్నంగా స్పందించారు. కొంతమంది ఆయన తీరును తప్పుబట్టగా మరికొంతమంది ఒక మంచి మార్పు కోసమే ఆయన ఈ రకంగా ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

వెబ్దునియా పై చదవండి