Sami Tree: దసరా సందర్భంగా జమ్మి చెట్టును ఇంట్లో నాటితే అంత అదృష్టమా?

సెల్వి

మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (12:54 IST)
Jammi Plant
దసరా సందర్భంగా జమ్మి చెట్టును నాటడం విశేష ఫలితాలను ఇస్తుంది. జమ్మి చెట్టును ఇంటి ప్రధాన ద్వారం సమీపంలో పెంచడం మంచిది. ఇంట్లో జమ్మి చెట్టు నాటడం వల్ల పరిసరాల నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సానుకూలత నెలకొంటుంది. 
 
శని దోష ప్రభావం నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు కుటుంబ సభ్యులపై ఉంటాయని నమ్ముతారు. ఈ మొక్క దురదృష్టాన్ని దూరం చేసి శ్రేయస్సును తెస్తుంది. ఇంట్లో జమ్మి చెట్టును నాటడం వల్ల ఇంట్లో సభ్యుల అదృష్టం మారుతుంది. సంపద పెరుగుతుంది. జమ్మి చెట్టును సరైన దిశలో నాటడం వల్ల ఇంటికి శ్రేయస్సు వస్తుందని, పేదరికం తొలగుతుందని నమ్మకం. జమ్మి చెట్టును ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి.
 
పాండవులు అరణ్యవాసం సమయంలో జమ్మిచెట్టుపై ఆయుధాలు పెట్టారని పురాణాలు చెబుతుంటాయి. ఆ చెట్టు నుంచి ఆయుధాలు తీసి యుద్ధానికి వెళ్తే విజయం కలిగిందని ప్రతీతి. మనం జమ్మి చెట్టు అని పిలిచే శమీవృక్షం ప్రస్థావన రామాయణ, మహాభారతాల్లో మనకు కనిపిస్తుంది. 
 
రావణుని సంహరించే ముందు శ్రీరామచంద్రుడు, కౌరవులపై విజయాన్నిసాధించేముందు పాండవులు శమీ వృక్షానికి పూజలు చేశారు. వారికి విజయాలను అందించిన శమీవృక్షాన్ని పూజిస్తే మనకు కూడా భవిష్యత్తులో విజయాలు లభిస్తామన్ననమ్మకంతో విజయ దశమి నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు.
 
త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. దసరా రోజున చారిత్రక జమ్మిచెట్టు వద్దకు వెళ్లి కంకణాలు కట్టుకొని పూజలు నిర్వహిస్తారు. సానుకూల శుభ ఫలితాల కోసం నిత్యం జమ్మి చెట్టుకు నీరు పోసి సంరక్షించాలి. క్రమం తప్పకుండా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, పసుపు కుంకుమలతో పూజించాలి. 
 
సాయం సంధ్యా సమయంలో జమ్మి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని వలన కలిగే దుష్ప్రభావాలు పోతాయని విశ్వాసం. దసరా పండగ రోజున శమీ పూజ చేస్తారు. తర్వాతే జమ్మి ఆకులను ప్రజలు పంచుకుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు