చిన్నాపెద్ద ఇష్టపడే ఖీమా హల్వా!

File
FILE
మీల్‌ మేకర్‌ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండేవారు దీన్ని మరింత ఇష్టంగా భుజిస్తారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువేనని పాకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మీల్‌మేకర్‌తో అనేక రకాల వంటను తయారు చేయవచ్చు. అలాంటి వాటిలో ఒకటి ఖీమా హల్వా. దీని తయారీ కోసం కింది పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

కావలసిన వస్తువులు:
మీల్‌ మేకర్‌ ఖీమా : 1/2 కిలో
క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌ తురుము: ఒక కప్పు
జీడీపప్పు, ద్రాక్ష: 25 గ్రాములు
చక్కెర: ఒక కప్పు
ఇలాయిచీ పొడి: చిటికెడు
నెయ్యి: 100 గ్రాములు
పాలు: 2 కప్పులు

తయారు చేసే విధానం:
ముందుగా మీల్‌ మేకర్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఐదు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించి జార్‌లో ఖీమా బ్లేడ్‌ పెట్టి ఖీమాలాగా చేసిపెట్టుకోవాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ వేయించి పక్కనబెట్టు కోవాలి. క్యారెట్‌ తురుము వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే బాణలిలో పాలు పోసి బాగా వేడి చేసి అందులో వేయించిన క్యారెట్‌, ఉడికించిన సోయా ఖీమా వేసి తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనిచ్చి ఇలాయిచి పొడి వేసి నెయ్యి తేలేలాగా దగ్గర కానివ్వాలి. దించే ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి దించాలి. ఇది కొద్దిగా చల్లారాక సర్వ్‌ చేసుకుంటే వెరైటీగానూ, రుచిగానూ ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి