కాకరతో చిప్స్ ఎలా చేయాలో మీకు తెలుసా?

మంగళవారం, 2 ఏప్రియల్ 2013 (17:47 IST)
FILE
కాకరకాయను ఆహారంలో వారానికి రెండుసార్లు చేర్చుకోవాలని ఆహార నిపుణులు అంటున్నారు. శరీరంలోని బ్యాక్టీరియాను హరించే కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనిని వారానికి రెండుసార్లు తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కూరల రూపంలోనూ లేదా నూనెల్లో వేపుడు మూలంగా వీటిని తీసుకోవచ్చు. అయితే పిల్లలకు కాకర అంటే వామ్మో అంటూ పరిగెత్తుకుంటారు. అలాంటిది పిల్లలకు నచ్చే విధంగా కాకరకాయతో చిప్స్ ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు :
కాకరకాయలు - అర కిలో.
ధనియాలపొడి - 1 టీ స్పూన్.
కారం - అర టీ స్పూన్.
జీలకర్ర పొడి - అర టీ స్పూన్.
కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా.
మైదా - 70 గ్రా.
అల్లం, వెల్లుల్లి - ఒకటిన్నర టీ స్పూన్.
కొత్తిమీర - 2 కట్టలు.
ఉప్పు - తగినంత.
నిమ్మ ఉప్పు - అర టీ స్పూన్.
నూనె - వేపుడుకు తగినంత

తయారీ విధానం :
ముందు కాకరకాయల్ని శుభ్రం చేశాక చాకుతో పొడవుగా సన్నగా తరగండి. ఈ ముక్కల్ని మరుగుతున్న నీళ్లలో వేయండి. ఈ నీళ్లలో ఉప్పు, నిమ్మ ఉప్పు కలుకోవాలి. అయిదు నిమిషాల పాటు కాకరకాయ ముక్కల్ని ఉంచి నీళ్లను వడగట్టేయాలి.

ఓ గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరిగిన కొత్తిమీర, ఉప్పు కలిపి, ఆ మిశ్రమంలో కాసిన్ని నీళ్లు పోసి జారుడుపిండిలా సిద్ధం చేసుకోవాలి.

చల్లారిన కాకరకాయ ముక్కల్ని ఈ పిండిలో ముంచి నూనె వేడయ్యాక కరకరలాడేలా వేపుకోవాలి. వీటిని పిల్లలకు నచ్చే విధంగా సాస్‌తో సర్వ్ చేయొచ్చు. లేదా రైస్ లోకి సైడిష్‌గానూ వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి