మనం తినే ఆహారంలో మాంసకృత్తులతో పాటు, పీచు, మాంసాహారంతో సమానమైన అమినోయాసిడ్లు సున్నా కొలెస్ట్రాల్‌ను ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలను అందించడంలో ముందు సోయా గింజల గురించే చెప్పుకోవాలి. ఎంతో మేలు చేసి, ఎన్నో అనారోగ్యాలను దూరం చేసే ఇలాంటి పోషకాల గింజలతో కూర ఒక్కటే కాదు, ఇంటిల్లిపాదికి నచ్చేలా విభిన్న రుచులను ప్రయత్నిస్తే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అటువంటి ఒక వంటకమే సోయా పలావ్. ఎలా తయారు చేయాలో చూద్దామా...
సోయా పలావ్‌కు కావాల్సిన పదార్థాలు : సోయా గింజలు: ఒక కప్పు (ముందు రోజు నానబెట్టుకోవాలి) క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ ముక్కలు : రెండూ పావు కప్పు చొప్పున, పచ్చి బఠాణీ : పావు చెంచా, దాల్చిన ముక్కలు : రెండు యాలకులు : రెండు లవంగాలు : నాలుగు అల్లం వెల్లుల్లి ముద్ద : చెంచా, బాస్మతి బియ్యం : రెండు కప్పులు, నూనె : తగినంత నెయ్యి : పావుచెంచా కొత్తిమీర, పుదీనా తరుగు అలంకరణ కోసం, ఉప్పు సరిపడా.
తయారీ విధానం: ముందుగా యాలకులు, లవంగాలు దాల్చిన చెక్కని పొడి చేసుకోవాలి. బాణిలో నూనె వేడిచేసి జీరా, బిర్యానీ ఆకుల్ని వేయించాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించి తరువాత కూరగాయ ముక్కలు, పచ్చి బఠాణీ, సోయా గింజల్ని చేర్చాలి.
వాటిని కూడా రెండు నిమిషాలు వేయించి అల్లం వెల్లుల్లి మిశ్రమం వేయాలి. సిద్ధం చేసుకున్న మసాలా పొడి, ఉప్పు కూడా వేసి కూర ముక్కలు బాగా పట్టేలా కలిపి తరువాత కడిగిన బియ్యం వేయాలి.
ఇందులో రెండు కప్పుల నీళ్ళు పోసి, నెయ్యి వేసి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు కుక్కరులో ఉడికించాలి. ఉడికిన పలావ్‌ను మరో పాత్రలోకి తీసుకుని పుదీనా, కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే వేడివేడి పులావ్ సిద్ధమైనట్లే. ఈ పలావ్‌ను చికెన్ గ్రేవీ, కడాయ్ పనీర్‌తో సర్వ్ చేయాలి.