"ఆడ బాస్" కంటే "మగ బాస్" ఎంతో నయం: మహిళా ఉద్యోగులు
"ఆడ బాస్ దగ్గర పనిచేయాలా...? అమ్మబాబోయ్.. కుదరదంటే కుదరదు. ఆ బాస్‌కో దణ్ణం ఆ ఉద్యోగానికో దణ్ణం.." అంటున్నారట లండన్‌లోని మహిళా ఉద్యోగులు. మగ బాస్‌ల మూడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, కానీ ఆడ బాస్‌ల వ్యవహారం ఓ పట్టాన అంతుపట్టదనీ, ఏ క్షణంలో ఏం మాట్లాడతారో... ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియక అనునిత్యం టెన్షన్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతామని చెపుతున్నారు.
"ఆడ్ బాస్/మగ బాస్... ఎవరి వద్ద పనిచేయడం బావుంటుంద"న్న అంశంపై ఇంగ్లండుకు చెందిన ఓ బృందం సర్వే చేపట్టింది. ఈ సర్వేలో సుమారు 2 వేల మంది పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో 63 శాతం మంది 'మగ బాస్'లకే ఓటు వేశారు.
'ఆడ బాస్'లకు కేవలం 37 శాతం మంది మాత్రం ఓకే చెప్పారు. 'ఆడ బాస్'లు ఎందుకు నచ్చటం లేదో చెప్పమని అడిగినప్పుడు వారిలా చెప్పుకొచ్చారు. మగబాస్ ఏ సమస్యనైనా అప్పటికప్పుడే తేల్చేస్తారనీ, ముక్కుసూటిగా మాట్లాడతారనీ, ముఖ్యంగా ఆడవారి సమస్యలపట్ల మగ బాస్‌లు సానుకూల వైఖరిని కనబరుస్తారని చెప్పారు. అదే ఆడ బాస్‌లైతే... తాము ఏ సమస్య చెప్పినా అడ్డగోలు ప్రశ్నలు వేసి ఓ పట్టాన సమస్యకు పరిష్కారం చూపరని చెప్పారు.
సర్వేలో తేలిన మరో విశేషమేమిటంటే... ఆడ బాస్‌లు ఉద్యోగస్తుల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో దిట్ట అని తేలింది. ఇక మగ బాస్‌లు కార్యాలయంలోని అన్ని పనులతోపాటు ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల పట్ల సత్వరమే స్పందించే గుణాన్ని కలిగి ఉంటారని తేలింది.